


సత్యం వార్త / నంద్యాల జిల్లా బ్యూరో / మార్చి 06 :
మార్చి 9వ తేదీన డోన్ మండలం కొత్త బురుజు గ్రామంలో రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటన జరగనున్న నేపథ్యంలో నిర్వహించనున్న కార్యక్రమాల ఏర్పాట్లను సమగ్రంగా, పకడ్బందీగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి అధికారులను ఆదేశించారు. గురువారం డోన్ పట్టణంలోని ఆర్ అండ్ బి అతిథి గృహంలో జిల్లా స్థాయి అధికారులతో ఆమె సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ సునీల్ షొరాణ్, జాయింట్ కలెక్టర్ కొల్లాబత్తుల కార్తీక్ తో పాటు వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సీఎం పర్యటన సందర్భంగా కొత్త బురుజు గ్రామానికి వెళ్లే గ్రామాల పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు. రహదారుల వెంట చెత్త కుప్పలు, ప్లాస్టిక్ కవర్లు, మద్యం సీసాలు కనిపిస్తున్నాయని పేర్కొంటూ వాటిని తక్షణమే తొలగించి శుభ్రతను కాపాడాలని అధికారులకు ఆదేశించారు. ముఖ్యమంత్రి ఆకస్మికంగా సందర్శించే అవకాశం ఉన్నందున కొత్త బురుజు గ్రామం పూర్తిగా శుభ్రంగా, సక్రమంగా ఉండేలా చూడాలని తెలిపారు. మున్సిపల్ విభాగం వద్ద తగిన సంఖ్యలో సిబ్బంది ఉన్నందున పరిశుభ్రత పనులను వేగవంతంగా పూర్తి చేయాలని సూచించారు. అలాగే కమ్యూనికేషన్ సదుపాయాల కోసం బీఎస్ఎన్ఎల్ ద్వారా 26 కిలోమీటర్ల లైన్ ఏర్పాటు చేసేందుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని బిఎస్ఎన్ఎల్ అధికారులను సూచించారు. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా నాలుగు ప్రదేశాల్లో కూల్ క్యాంపులు ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రతి క్యాంపులో తాగునీరు, ఆర్వో వాటర్, ప్లాస్టిక్ గ్లాసులు, డస్ట్ బిన్ లు వంటి సౌకర్యాలు అందుబాటులో ఉంచాలని తెలిపారు.
జిల్లా ప్రత్యేకతలను ప్రతిబింబించే విధంగా ప్రదర్శన స్టాళ్లను ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. డోన్ ప్రాంతం మైనింగ్, హార్టికల్చర్ మరియు నీటి కొరత ప్రాంతంగా గుర్తింపు పొందినందున మొదటి స్టాల్ లో ఈ అంశాలను ప్రధానంగా ప్రదర్శించాలని తెలిపారు. హార్టికల్చర్ విభాగం ఆధ్వర్యంలో అరటి సాగు సహా ఇతర ప్రధాన పంటల వివరాలను కూడా ప్రదర్శించాలన్నారు. పర్యాటక రంగాన్ని ప్రోత్సహించే విధంగా బెలుం గుహలు మరియు వాల్మీకి గుహల గురించి వివరాలు, వీడియో ప్రదర్శనలు ఏర్పాటు చేయాలని సూచించారు. మొదటి స్టాల్ను జిల్లా మరియు డోన్ ప్రాంత ప్రత్యేకతలపై, రెండవ స్టాల్ను వెంగలంపల్లె గ్రామ అభివృద్ధిపై, మూడవ స్టాల్ను సాసా కార్యక్రమంపై, నాలుగవ స్టాల్ను పి4 బంగారు కుటుంబం పథకంపై ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రతి స్టాల్ వద్ద వివరణ ఇచ్చేందుకు ఇద్దరు లేదా ముగ్గురు అధికారులను మాత్రమే నియమించి, వారి పేర్లను ముందుగానే ఎస్పీకి సమర్పించాలని తెలిపారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి మధ్యాహ్నం పొలాన్ని సందర్శించే అవకాశం ఉన్నందున సంబంధిత అధికారులు పూర్తిస్థాయి సమాచారంతో సిద్ధంగా ఉండాలని జిల్లా కలెక్టర్ సూచించారు. ఆ సమయంలో విఆర్ఓ, పంచాయతీ కార్యదర్శి, విలేజ్ సర్వేయర్ మరియు వ్యవసాయ సహాయకుడు మాత్రమే అక్కడ ఉండాలని తెలిపారు. రైతులకు సంబంధించిన వివరాలను క్యూ ఆర్ కోడ్ ద్వారా అందుబాటులో ఉంచాలని చెప్పారు. ఎండ తీవ్రత కారణంగా ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉన్నందున నాలుగు అంబులెన్సులను సిద్ధంగా ఉంచాలని, కాన్వాయ్ లో కూడా రెండు అంబులెన్సులు ఉండేలా చర్యలు తీసుకోవాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులను కలెక్టర్ ఆదేశించారు.
జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ సునీల్ షొరాణ్ మాట్లాడుతూ భద్రతా ఏర్పాట్లలో విద్యుత్ తీగలు, వైరింగ్ వంటి అంశాలపై ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. లోడ్ ను దృష్టిలో ఉంచుకుని తగిన విధంగా విద్యుత్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. అలాగే పార్కింగ్ ప్రాంతాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడం, కాన్వాయ్ కు మంచి స్థితిలో ఉన్న వాహనాలు ఏర్పాటు చేయడం వంటి చర్యలను చేపట్టాలని ఆర్టీఓ సహా సంబంధిత అధికారులకు సూచించారు.
