ఉగాది రద్దీ దృష్ట్యా దర్శన సమయాల్లో మార్పులు – మహానంది ఈవో నల్లకాలువ శ్రీనివాస రెడ్డి

సత్యం వార్త / నంద్యాల జిల్లా ప్రతినిధి / మార్చి 12 :
ఉగాది పండుగ సందర్భంగా కర్ణాటకతో పాటు పరిసర ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు శ్రీ స్వామి అమ్మవారి దర్శనానికి వచ్చే అవకాశముండటంతో ఆలయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని ఈవో నల్లకాలువ శ్రీనివాస రెడ్డి ఆదేశించారు. ఈ మేరకు మార్చి 13వ తేదీ నుండి తదుపరి ఆదేశాలు వచ్చే వరకు దర్శన, సేవా కార్యక్రమాల సమయాల్లో మార్పులు అమలు చేయనున్నారు.
ప్రతిరోజు నిత్య పూజలు పూర్తైన అనంతరం సాయంత్రం 5 గంటలకు అష్టవిధ మహా మంగళ హారతులు నిర్వహించి, అనంతరం ఇతర సేవలు మరియు దర్శనాలను ప్రారంభించనున్నట్లు తెలిపారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అన్ని ఏర్పాట్లు సక్రమంగా నిర్వహించాలని ఆలయ సిబ్బందికి సూచించారు.
అదేవిధంగా భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా రేపటి నుండి ఆలయం వెలుపల రెండు మెయిన్ బుకింగ్ కౌంటర్లు, రెండు ప్రసాదం కౌంటర్లను నిరంతరంగా నిర్వహించనున్నట్లు ఈవో నల్లకాలువ శ్రీనివాస రెడ్డి తెలిపారు. భక్తులకు సౌకర్యవంతమైన దర్శనం కల్పించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు.

Scroll to Top