నంద్యాలలో ‘శ్రీ అన్న మిల్లెట్ క్విక్ సర్వీసెస్’ రెస్టారెంట్ ప్రారంభం

చిరుధాన్యాలతోనే ఆరోగ్య సిరి – మిల్లెట్ మ్యాన్ అఫ్ ఇండియా ఖాదర్ వలీ

సత్యం వార్త / నంద్యాల / మార్చి 02 :

చిరుధాన్యాలను ఆహారంలో భాగం చేసుకోవడం ద్వారానే సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుందని ‘మిల్లెట్ మ్యాన్ ఆఫ్ ఇండియా’ డాక్టర్ ఖాదర్ వలీ పేర్కొన్నారు. సోమవారం పట్టణంలోని పద్మావతి నగర్‌లో ఏర్పాటు చేసిన ‘శ్రీ అన్న మిల్లెట్ క్విక్ సర్వీసెస్ ‘ రెస్టారెంట్‌ను మున్సిపల్ కమిషనర్ శేషన్న, ఎస్బీఐ రీజినల్ మేనేజర్ సూర్యప్రకాష్, నిర్వాహకులు కె. రామసుబ్బారెడ్డిలతో కలిసి ఆయన ప్రారంభించారు.

​ఈ సందర్భంగా ఖాదర్ వలీ మాట్లాడుతూ.. పూర్వీకులు వాడిన చిరుధాన్యాలను విస్మరించడం వల్లే నేడు అనేక రోగాలు, వైరస్‌లు మానవ శరీరంపై సులువుగా దాడి చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కొర్రలు, సామలు, అండుకొర్రలు, ఊదలు, అరికెలు.. ఈ ఐదింటిలో అద్భుతమైన ఔషధ గుణాలు ఉన్నాయని వివరించారు.

​చిరుధాన్యాల వాడకంతో వీటిలో ఉండే పోషకాలు శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని పెంపొందిస్తాయని,

​రక్తంలోని చక్కెర స్థాయిలను క్రమబద్ధీకరించడంలో చిరుధాన్యాలు మేటిగా పనిచేస్తాయని,వీటిలో పీచు (ఫైబర్) అధికంగా ఉండటం వల్ల జీర్ణక్రియ మెరుగుపడి, మలబద్ధకం వంటి సమస్యలు దరిచేరవన్నారు .

ఊబకాయంతో బాధపడేవారు చిరుధాన్యాలను తీసుకుంటే సులభంగా బరువు తగ్గవచ్చని, వీటిలోని యాంటీ ఆక్సిడెంట్లు చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయన్నారు.

​మన జీవనశైలిలో చిరుధాన్యాలను భాగం చేసుకుంటే సగం జబ్బులను నియంత్రించవచ్చని ఖాదర్ వలీ సూచించారు. అనంతరం స్థానికులు అడిగిన పలు ఆరోగ్య సమస్యలకు, సందేహాలకు ఆయన సమాధానాలిచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు, ఆహార ప్రియులు పాల్గొన్నారు.

Scroll to Top