
సత్యం వార్త / నంద్యాల జిల్లా ప్రతినిధి / మార్చి 02:
నంద్యాల అర్బన్ తాసిల్దార్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. తహశీల్దార్ శ్రీనివాసులు స్వయంగా పాల్గొని ప్రజల నుంచి వచ్చిన వినతులను స్వీకరించారు.
ఈ సందర్భంగా భూ వివాదాలు, ఆన్లైన్ నమోదు లోపాల సవరణ, పత్తాదారు పాస్‌బుక్ సమస్యలు తదితర అంశాలపై పలు వినతిపత్రాలు అందాయి. ప్రతి ఫిర్యాదును సంబంధిత శాఖల అధికారులకు పంపిస్తూ సమగ్ర విచారణ జరిపి నిర్ణీత గడువులో పరిష్కరించాల్సిందిగా తహశీల్దార్ ఆదేశించారు.
అనంతరం జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి గణియా నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో తహశీల్దార్‌తో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ప్రజల నుంచి అందిన వినతులను సత్వరమే, పారదర్శకంగా పరిష్కరించాలని కలెక్టర్ స్పష్టం చేశారు. పెండింగ్ కేసులను ప్రాధాన్యతతో తీసుకొని వేగవంతంగా చర్యలు చేపట్టాలని ఆమె దిశానిర్దేశం చేశారు.
ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించి ప్రజలకు న్యాయం జరిగేలా చూడాలని కలెక్టర్ సూచించారు.
