- నైపుణ్యాభివృద్ధితో స్వావలంబన లక్ష్యం – ఆర్ఎస్ఈఎస్టీఐ సేవలను సద్వినియోగం చేసుకోవాలి – ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి, జిల్లా కలెక్టర్ జి రాజకుమారి
- యువత, మహిళలకు ఉపాధి అవకాశాల కల్పనలో ఆర్ఎస్ఈఎస్టీఐ కీలక వేదిక


సత్యం వార్త / నంద్యాల జిల్లా బ్యూరో / జూన్ 17 : గ్రామీణ నిరుద్యోగ సమస్యను పరిష్కరించేందుకు RSETI కీలక పాత్ర పోషిస్తోందని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి, నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు, లోక్ సభ టీడీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి డాక్టర్ బైరెడ్డి శబరి లు అన్నారు.
బుధవారం నంద్యాల పట్టణంలోని క్రాంతినగర్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన ఆర్ఎస్ఈఎస్టీఐ (RSETI – Rural Self Employment Training Institute) శిక్షణ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ రాజకుమారి, నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ బైరెడ్డి శబరి, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కర్నూల్ రీజినల్ హెడ్ డి. అనిల్ కుమార్ సంయుక్తంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్రంలోని శిక్షణా సదుపాయాలను పరిశీలించారు.
జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి మాట్లాడుతూ, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ – RSETIలో గ్రామీణ నిరుద్యోగ యువత శిక్షణ పొంది పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి” అని పిలుపునిచ్చారు. “ప్రభుత్వ పథకాలు, బ్యాంకుల సహకారంతో గ్రామీణ నిరుద్యోగ సమస్యను పరిష్కరించే దిశగా RSETI కీలక పాత్ర పోషిస్తోందన్నారు. ఆధునిక అవసరాలకు అనుగుణంగా శిక్షణ అందించడం ద్వారా యువతను స్వయం ఉపాధి వైపు మళ్లించి ఆర్థికంగా స్వావలంబన సాధించేలా చేయడమే ఈ కేంద్రం ప్రధాన లక్ష్యమని తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, బ్యాంకుల ఆర్థిక సహకారం మరియు నైపుణ్యాభివృద్ధి శిక్షణలను సమన్వయం చేస్తూ గ్రామీణ నిరుద్యోగ సమస్యకు పరిష్కార మార్గాలను చూపడంలో ఆర్ఎస్ఈఎస్టీఐ కేంద్రాలు సమర్థవంతంగా పనిచేస్తున్నాయని అన్నారు. శిక్షణ పొందిన యువత ఉద్యోగాల కోసం ఎదురుచూడకుండా స్వయంగా పారిశ్రామికవేత్తలుగా ఎదిగి ఇతరులకు కూడా ఉపాధి కల్పించే స్థాయికి చేరుకోవాలని సూచించారు.
నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ బైరెడ్డి శబరి మాట్లాడుతూ, “RSETI ద్వారా గ్రామీణ యువతకు ఉచిత శిక్షణ ఇచ్చి, బ్యాంకు రుణ సహాయంతో స్వయం ఉపాధి కల్పించడం ప్రధాన లక్ష్యమన్నారు. ఈ RSETI సంస్థ ద్వారా మరింత మంది యువతకు స్వయం ఉపాధి అవకాశాలు లభిస్తాయి” అని అన్నారు. గ్రామీణ యువతకు ఉచితంగా వృత్తి, నైపుణ్య శిక్షణ అందించి, అనంతరం బ్యాంకుల రుణ సహాయంతో స్వయం ఉపాధి అవకాశాలు కల్పించడం ఆర్ఎస్ఈఎస్టీఐ ప్రధాన ఉద్దేశమని తెలిపారు. ఈ కేంద్రం ద్వారా జిల్లాలో మరింత మంది యువత, మహిళలు ఆర్థికంగా బలోపేతమై తమ కుటుంబాల అభివృద్ధికి తోడ్పడతారని ఆశాభావం వ్యక్తం చేశారు.
యూనియన్ బ్యాంక్ రీజినల్ హెడ్ డి. అనిల్ కుమార్ మాట్లాడుతూ, “సమాజంలోని బలహీన వర్గాల ఆర్థికాభివృద్ధి కోసం యూనియన్ బ్యాంక్ కట్టుబడి ఉందన్నారు. నంద్యాల RSETI ద్వారా రైతులు, మహిళలు, SHG సభ్యులకు నైపుణ్య శిక్షణ అందించి వారిని ఆర్థికంగా స్వావలంబన చేస్తాం” అని తెలిపారు. ఈ కార్యక్రమంలో RSETI డైరెక్టర్, బి అరుణకుమారి, శిక్షకులు, సిబ్బంది, శిక్షణార్థులు, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
