నంద్యాలలో  “రెండేళ్ల నమ్మకం – అభివృద్ధి, సంక్షేమం” కార్యక్రమం ఘన విజయవంతం

ప్రతి అర్హత కుటుంబానికి ప్రభుత్వ పథకాల ఫలాలు చేరేలా చర్యలు

ప్రజలకు చేరువైన సంక్షేమం.. వేగవంతమైన అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం

రాష్ట్ర అభివృద్ధికి మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యం : మంత్రులు ఎన్ఎండి ఫరూక్, బీసీ జనార్దన్ రెడ్డి

‘టీమ్ ఎఫర్ట్’తో జిల్లాను రాష్ట్రంలో అగ్రగామిగా తీర్చిదిద్దుదాం – జిల్లా కలెక్టర్ జి రాజకుమారి

సత్యం వార్త / నంద్యాల జిల్లా బ్యూరో / జూన్ 17  :

ప్రతి అర్హత కుటుంబానికి ప్రభుత్వ పథకాల ఫలాలు చేరేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామని రాష్ట్ర న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్.ఎం.డి. ఫరూక్,  రోడ్లు, భవనాలు, పెట్టుబడులు మరియు మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బి.సి. జనార్ధన్ రెడ్డిలు అన్నారు. బుధవారం నంద్యాల పట్టణంలోని టెక్కే మార్కెట్ యార్డు ఆవరణలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న “రెండేళ్ల నమ్మకం – అభివృద్ధి, సంక్షేమం” కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి, నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు బైరెడ్డి శబరి, ఆళ్లగడ్డ, నందికొట్కూరు, పాణ్యం, ఆత్మకూరు నియోజకవర్గాల ఎమ్మెల్యేలు,జాయింట్ కలెక్టర్ సూరజ్ ధనుంజయ్, ఎస్పీ సునీల్ షోరాన్,  ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా రాష్ట్ర న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్.ఎం.డి. ఫరూక్ మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన సేవలు అందించడంలో అధికారులు కీలక పాత్ర పోషిస్తున్నారని అన్నారు. జిల్లా పరిపాలన యంత్రాంగం సమన్వయంతో అభివృద్ధి కార్యక్రమాలు సమర్థవంతంగా అమలవుతున్నాయని తెలిపారు. ప్రజలకు ఏ సమస్య వచ్చినా అధికారులు అందుబాటులో ఉండి పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. కార్యక్రమం విజయవంతం కావడానికి కృషి చేసిన అన్ని శాఖల అధికారులకు ఆయన అభినందనలు తెలిపారు.

రోడ్లు, భవనాలు, పెట్టుబడులు మరియు మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బి.సి. జనార్ధన్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల హామీల అమలుకు కట్టుబడి పనిచేస్తోందని తెలిపారు. యువత ఉపాధి అవకాశాల కల్పనకు చర్యలు చేపట్టడంతో పాటు విద్యా రంగానికి ప్రాధాన్యత ఇస్తున్నామని పేర్కొన్నారు. రాష్ట్రంలో పరిశ్రమల అభివృద్ధికి అనుకూల వాతావరణం కల్పిస్తూ కొత్త పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందన్నారు. రహదారుల అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ ఆర్ అండ్ బి శాఖ ద్వారా విస్తృత స్థాయిలో రోడ్ల మరమ్మతులు, అభివృద్ధి పనులు చేపట్టినట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా గుంతలు లేని రహదారుల లక్ష్యంతో పనులు కొనసాగుతున్నాయని చెప్పారు. సంక్షేమ పథకాల అమలులో ప్రభుత్వం పారదర్శకతకు ప్రాధాన్యత ఇస్తోందని, అర్హులైన ప్రతి లబ్ధిదారునికి ప్రభుత్వ ప్రయోజనాలు చేరేలా చర్యలు తీసుకుంటోందని పేర్కొన్నారు. ప్రజల సహకారంతో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను మరింత సమర్థవంతంగా అమలు చేస్తామని తెలిపారు.

జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి మాట్లాడుతూ, నంద్యాల జిల్లా ఆర్థికాభివృద్ధికి వ్యవసాయం, అనుబంధ రంగాలే ప్రధాన ఆధారమని, జిల్లా స్థూల ఆర్థికోత్పత్తి (జీడీపీ)లో దాదాపు 45 శాతం వాటా ఈ రంగాల నుంచే లభిస్తోందని తెలిపారు. గత రెండేళ్లలో పీఎం కిసాన్, అన్నదాత సుఖీభవ పథకాల ద్వారా 2.06 లక్షల మంది రైతులకు సుమారు రూ.400 కోట్ల ఆర్థిక సహాయం అందిందన్నారు. విత్తనాలు, ఎరువులు, ఇతర సబ్సిడీల రూపంలో వ్యవసాయ రంగానికి రూ.430 కోట్ల మద్దతు లభించిందని చెప్పారు. హార్టికల్చర్ అభివృద్ధికి 21 వేల హెక్టార్లలో రూ.156 కోట్ల వ్యయంతో కార్యక్రమాలు చేపట్టినట్లు వెల్లడించారు. మైక్రో ఇరిగేషన్ కింద 8,816 మంది రైతులకు రూ.71 కోట్ల సబ్సిడీ అందించగా, పశుసంవర్ధక, మత్స్యశాఖల ద్వారా కూడా రైతులకు గణనీయమైన ప్రోత్సాహం లభించిందన్నారు. మొత్తంగా వ్యవసాయ, అనుబంధ రంగాలకు గత రెండేళ్లలో రూ.600 కోట్లకు పైగా మద్దతు అందిందని కలెక్టర్ తెలిపారు తెలిపారు.

జిల్లా ఎస్పీ సునీల్ షోరాన్ మాట్లాడుతూ, జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూనే, పోలీస్ స్టేషన్లకు వచ్చే ప్రజలతో మర్యాదపూర్వకంగా వ్యవహరిస్తూ వారి సమస్యలను సత్వరమే పరిష్కరిస్తున్నామని తెలిపారు. సాంకేతికత వినియోగంలో భాగంగా డ్రోన్ పెట్రోలింగ్, సీసీటీవీ-360 వెబ్ ప్లాట్‌ఫామ్ ద్వారా నేరాల నియంత్రణ, నేరస్థుల గుర్తింపులో విశేష ఫలితాలు సాధిస్తున్నామని చెప్పారు. గత ఏడాదితో పోలిస్తే 70 శాతానికి పైగా ఆస్తి దొంగతన కేసులను ఛేదించి, 85 శాతం ఆస్తులను రికవరీ చేసినట్లు వెల్లడించారు. గంజాయి నియంత్రణలో నంద్యాల జిల్లా రాష్ట్రంలోనే అత్యల్ప వినియోగం కలిగిన జిల్లాల్లో ఒకటిగా నిలిచిందని, మహిళల భద్రత కోసం ‘ఆపరేషన్ దండాయం’ ద్వారా కేసులను వేగంగా విచారించి నిందితులకు త్వరితగతిన శిక్షలు పడేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అలాగే రోడ్డు భద్రతపై ప్రత్యేక దృష్టి సారించి గత మూడు నెలల్లో 1,500 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేయడంతో పాటు మద్యం సేవించి భారీ వాహనాలు నడిపిన 17 మంది డ్రైవర్లను జైలుకు పంపినట్లు పేర్కొన్నారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు నిర్భయంగా 112 సేవలను వినియోగించుకోవాలని, సమాచారం అందిన 10 నిమిషాల్లోపు పోలీసు సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని స్పందించేలా వ్యవస్థను బలోపేతం చేసినట్లు ఎస్పీ తెలిపారు.

నంద్యాల పార్లమెంటు సభ్యులు బైరెడ్డి శబరి మాట్లాడుతూ,  గత రెండేళ్లలో రాష్ట్రానికి భారీ పెట్టుబడులు ఆకర్షించడంతో పాటు ఉత్తరాంధ్ర, కోస్తా, రాయలసీమ ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందన్నారు. అమరావతికి చట్టబద్ధత కల్పించడం, రైల్వేలు, రహదారులు, మౌలిక వసతుల అభివృద్ధి వంటి కీలక ప్రాజెక్టులను ముందుకు తీసుకెళ్తున్నామని తెలిపారు. రైతులకు సాగునీరు, తాగునీటి సౌకర్యాలు కల్పిస్తూ వ్యవసాయ రంగానికి ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పారు.

శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి మాట్లాడుతూ, ప్రభుత్వం అమలు చేస్తున్న పెన్షన్లు, తల్లి వందనం, అన్నదాత సుఖీభవ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటి పథకాలు ప్రజలకు సమర్థవంతంగా చేరుతున్నాయని, అందుకే ప్రజలు సంతృప్తిగా ఉన్నారని పేర్కొన్నారు. ప్రతి నియోజకవర్గంలో అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయని, రాష్ట్ర ప్రగతికి కేంద్ర ప్రభుత్వ సహకారంతో పెట్టుబడులు, పరిశ్రమలు తీసుకువస్తున్నామని తెలిపారు.

పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి మాట్లాడుతూ, రైతుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని, తుంగభద్ర జలాల విషయంలో సీఎం జోక్యంతో కేసీ కాలువకు నీటి విడుదల సాధ్యమైందని తెలిపారు. అలాగే గోరకల్లు రిజర్వాయర్ మరమ్మతులు, ఇతర సాగునీటి ప్రాజెక్టులకు కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసి పనులు చేపట్టినట్లు వివరించారు.

ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ మాట్లాడుతూ, ప్రతి శుక్రవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కారానికి గ్రీవెన్స్ కార్యక్రమాలు నిర్వహించడం, గ్రామాల స్థాయిలో ప్రజల సమస్యలను తెలుసుకోవడం, పెన్షన్ల పంపిణీలో ప్రజల ఇళ్లకు వెళ్లడం వంటి చర్యల ద్వారా పారదర్శక పాలన అందిస్తున్నామని పేర్కొన్నారు. ప్రజల సంక్షేమం, రాష్ట్ర భవిష్యత్ అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందన్నారు.

Scroll to Top