
సత్యం వార్త / నంద్యాల / ఫిబ్రవరి 17 :
నంద్యాలలో నంది బాలోత్సవాలు మున్సిపల్ టౌన్ హాల్ నందు ఉత్సాహంగా ప్రారంభమయ్యాయి. జిల్లా నలుమూలల నుండి ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థల విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. తొలి రోజు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా విద్యాశాఖాధికారి పి. జనార్దన్ రెడ్డి ఆహ్వాన సంఘం గౌరవాధ్యక్షులు డా. రాకేష్ రెడ్డి, అధ్యక్షులు డా. డి. క్రాంతి చైతన్య తదితరులతో కలిసి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ పాఠశాలల్లో పాఠాలు మాత్రమే కాకుండా ఆటపాటలు, సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా విద్యార్థులలో దాగి ఉన్న ప్రతిభ వెలుగులోకి వస్తుందని తెలిపారు. బాలోత్సవాలు విద్యార్థుల సృజనాత్మకత, నైపుణ్యాలను అభివృద్ధి చేసే మంచి వేదికగా నిలుస్తాయని పేర్కొన్నారు. రెండు రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో విద్యార్థులు చురుకుగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఆహ్వాన సంఘం గౌరవాధ్యక్షులు డా. రాకేష్ రెడ్డి మాట్లాడుతూ ఇటువంటి కార్యక్రమాలు పిల్లల మానసిక ఉల్లాసానికి దోహదపడతాయని తెలిపారు. అధ్యక్షులు క్రాంతి చైతన్య విద్యార్థులు సమాజం పట్ల చైతన్యం కలిగి మూఢనమ్మకాల నుంచి దూరంగా ఉండాలని సూచించారు. నిర్వాహకులు మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా 40 కేంద్రాల్లో బాలోత్సవాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. మొదటి రోజు వ్యాసరచన, చిత్రలేఖనం, కథారచన, కవితారచన, ఉత్తరరచన, సైన్స్ ప్రదర్శన, ఏకపాత్రాభినయం, లఘునాటికలు, ఫ్యాన్సీ డ్రెస్సు, క్లాసికల్ నృత్యం తదితర పోటీలు నిర్వహించారు.
