వైభవంగా మహానందీశ్వరుడి రథోత్సవం

సత్యం వార్త / నంద్యాల జిల్లా బ్యూరో / ఫిబ్రవరి 17 :

మహానంది ప్రసిద్ధ శైవక్షేత్రంలో మంగళవారం సాయంత్రం మహానందీశ్వర స్వామివారి రథోత్సవం అపూర్వ వైభవంతో నిర్వహించారు. వేలాది మంది భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకొని భక్తిశ్రద్ధలతో రథాన్ని లాగారు. రథోత్సవ వేడుకలతో క్షేత్ర ప్రాంగణం శివనామస్మరణతో మార్మోగి భక్తిరసపూరిత వాతావరణం నెలకొంది. ఆలయ కార్యనిర్వహణాధికారి ఎన్. శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో అర్చకులు వేదమంత్రాల నడుమ స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పూర్ణకుంభ స్వాగతంతో ఉత్సవమూర్తులను రథంపై ప్రతిష్ఠించి రథయాత్ర ప్రారంభించారు. సంప్రదాయ వాయిద్యాలు, మంగళవాయిద్యాల మధ్య రథం ఆలయ ప్రదక్షిణ మార్గంలో నడిపారు. భక్తులు “ఓం నమశ్శివాయ” నినాదాలతో రథాన్ని లాగుతూ ఉత్సాహంగా పాల్గొన్నారు. రథోత్సవాన్ని తిలకించేందుకు పరిసర ప్రాంతాల నుండి భారీగా భక్తులు చేరుకున్నారు. భక్తులకు త్రాగునీరు, ప్రసాదం తదితర సదుపాయాలు ఆలయ అధికారులు సమకూర్చారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసి రద్దీని సమర్థవంతంగా నియంత్రించారు. సాయంత్రం జరిగిన రథోత్సవం మహానంది క్షేత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచి, భక్తులకు కనులపండువగా మారింది.

Scroll to Top