చిరుధాన్యాలతోనే ఆరోగ్య సిరి – మిల్లెట్ మ్యాన్ అఫ్ ఇండియా ఖాదర్ వలీ


సత్యం వార్త / నంద్యాల / మార్చి 02 :
చిరుధాన్యాలను ఆహారంలో భాగం చేసుకోవడం ద్వారానే సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుందని ‘మిల్లెట్ మ్యాన్ ఆఫ్ ఇండియా’ డాక్టర్ ఖాదర్ వలీ పేర్కొన్నారు. సోమవారం పట్టణంలోని పద్మావతి నగర్లో ఏర్పాటు చేసిన ‘శ్రీ అన్న మిల్లెట్ క్విక్ సర్వీసెస్ ‘ రెస్టారెంట్‌ను మున్సిపల్ కమిషనర్ శేషన్న, ఎస్బీఐ రీజినల్ మేనేజర్ సూర్యప్రకాష్, నిర్వాహకులు కె. రామసుబ్బారెడ్డిలతో కలిసి ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఖాదర్ వలీ మాట్లాడుతూ.. పూర్వీకులు వాడిన చిరుధాన్యాలను విస్మరించడం వల్లే నేడు అనేక రోగాలు, వైరస్లు మానవ శరీరంపై సులువుగా దాడి చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కొర్రలు, సామలు, అండుకొర్రలు, ఊదలు, అరికెలు.. ఈ ఐదింటిలో అద్భుతమైన ఔషధ గుణాలు ఉన్నాయని వివరించారు.
చిరుధాన్యాల వాడకంతో వీటిలో ఉండే పోషకాలు శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని పెంపొందిస్తాయని,
రక్తంలోని చక్కెర స్థాయిలను క్రమబద్ధీకరించడంలో చిరుధాన్యాలు మేటిగా పనిచేస్తాయని,వీటిలో పీచు (ఫైబర్) అధికంగా ఉండటం వల్ల జీర్ణక్రియ మెరుగుపడి, మలబద్ధకం వంటి సమస్యలు దరిచేరవన్నారు .
ఊబకాయంతో బాధపడేవారు చిరుధాన్యాలను తీసుకుంటే సులభంగా బరువు తగ్గవచ్చని, వీటిలోని యాంటీ ఆక్సిడెంట్లు చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయన్నారు.
మన జీవనశైలిలో చిరుధాన్యాలను భాగం చేసుకుంటే సగం జబ్బులను నియంత్రించవచ్చని ఖాదర్ వలీ సూచించారు. అనంతరం స్థానికులు అడిగిన పలు ఆరోగ్య సమస్యలకు, సందేహాలకు ఆయన సమాధానాలిచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు, ఆహార ప్రియులు పాల్గొన్నారు.
