ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడడం చాలా సంతోషంగా ఉందన్న దండే రవీంద్రనాథ్ రెడ్డి , దండే రంగ శేఖర్ రెడ్డి
గ్రామస్తులకు అండగా ఉంటూ ‘బంగారు కుటుంబాలు’గా తీర్చిదిద్దడమే మా లక్ష్యం :- దండే రవీంద్రనాథ్ రెడ్డి , దండే రంగ శేఖర్ రెడ్డి


సత్యం వార్త / నంద్యాల జిల్లా బ్యూరో / మార్చి 31 :
నంద్యాల నియోజకవర్గం, గోస్పాడు మండలం, ఎం. కృష్ణాపురం గ్రామానికి చెందిన లేట్ దండే రంగారెడ్డి కుమారులు ప్రముఖ సామాజిక కార్యకర్తలు, P4 మార్గదర్శులు దండే రవీంద్రనాథ్ రెడ్డి , దండే రంగ శేఖర్ రెడ్డి లను రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ అభినందించారు. మంగళవారం నంద్యాలలోని మంత్రి క్యాంప్ కార్యాలయంలో వారు మంత్రి ఫరూక్ ని మర్యాదపూర్వకంగా కలిశారు. సోమవారం స్థానిక పీజీఆర్ఎస్ హాల్ నుండి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తో జరిగిన వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్న దండే రవీంద్రనాథ్ రెడ్డి , దండే రంగ శేఖర్ రెడ్డి గ్రామంలో తాము చేపడుతున్న సేవా కార్యక్రమాలను వివరించారు. ఈ సందర్భంగా వారి సేవలను గుర్తించిన నంద్యాల జిల్లా ఇంచార్జి మంత్రి పయ్యావుల కేశవ్ , జిల్లా మంత్రి ఫరూక్, గ్రామాభివృద్ధిలో వారు చూపిస్తున్న చొరవను ప్రత్యేకంగా కొనియాడారు.
ఈ సందర్భంగా దండే రవీంద్రనాథ్ రెడ్డి , దండే రంగ శేఖర్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన P4 (పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్టనర్షిప్) కార్యక్రమం తమకు ఎంతో స్ఫూర్తినిచ్చిందని తెలిపారు. గ్రామంలో నీటి కొరతను నివారించి, ప్రతి ఇంటికీ శుద్ధమైన తాగునీటిని అందిస్తున్నామన్నారు. ప్రభుత్వ పింఛన్లు అందని నిరుపేదలను గుర్తించి, సొంత నిధులతో నెలకు రూ. 2,000 చొప్పున ఆర్థిక సహాయం అందిస్తున్నామన్నారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల ప్రగతి కోసం ప్రతి గురువారం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. పేద కుటుంబాల్లో ఎవరైనా మరణిస్తే అంత్యక్రియల కోసం రూ. 5,000, ఆడపిల్లల వివాహాలకు రూ. 10,000 సహాయం అందిస్తున్నామన్నారు. ఒంటరిగా ఉంటున్న వృద్ధులకు భోజన వసతి కల్పిస్తున్నామన్నారు. నిరుద్యోగ యువతకు హైదరాబాద్ వంటి నగరాల్లో ఉపాధి అవకాశాలు లభించేలా సహకరిస్తున్నామన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి ఫరూక్ గారి ప్రోత్సాహంతో గ్రామంలోని ప్రతి కుటుంబాన్ని బంగారు కుటుంబంగా తీర్చిదిద్దడమే మా లక్ష్యం అని తెలిపారు. మా సేవలను ముఖ్యమంత్రి చంద్రబాబు, నంద్యాల జిల్లా ఇంచార్జి మంత్రి పయ్యావుల కేశవ్ , జిల్లా మంత్రి ఎన్ఎండి ఫరూక్, జిల్లా కలెక్టర్ రాజకుమారి, నంద్యాల జిల్లా ఎస్పీ సునీల్ షెరాన్, జాయింట్ కలెక్టర్ కార్తీక్ స్వయంగా గుర్తించి అభినందించడం మాకు మరింత ఉత్సాహాన్ని ఇచ్చిందని వారు తెలిపారు . ఇదే స్ఫూర్తితో భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతామని తెలిపారు.
మంత్రి ఎన్ఎండి ఫరూక్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆకాంక్షించిన P4 (పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్టనర్షిప్) స్ఫూర్తిని ఎం. కృష్ణాపురం గ్రామంలో దండే రవీంద్రనాథ్ రెడ్డి , దండే రంగ శేఖర్ రెడ్డి లు నిజం చేసి చూపిస్తున్నారని . ప్రభుత్వం అందించే సంక్షేమ ఫలాలతో పాటు, సమాజం పట్ల బాధ్యతతో సొంత నిధులను వెచ్చించి పేద ప్రజలకు అండగా నిలవడం అభినందనీయమన్నారు. గ్రామంలోని ప్రతి కుటుంబాన్ని బంగారు కుటుంబంగా తీర్చిదిద్దాలనే వారి సంకల్పం మిగతా వారికి మార్గదర్శకమన్నారు. ముఖ్యంగా ప్రభుత్వ పింఛన్లు అందని వారికి ఆర్థిక సాయం చేయడం, విద్యార్థుల అభివృద్ధికి తోడ్పడటం, అంత్యక్రియలు మరియు వివాహాలకు సాయం అందించడం వంటి కార్యక్రమాలు వారి మానవత్వాన్ని చాటుతున్నాయని . ఇలాంటి సేవా గుణం కలిగిన వ్యక్తులకు ప్రభుత్వం తరపున ఎల్లప్పుడూ పూర్తి సహకారం ఉంటుందని మంత్రి ఫరూక్ తెలిపారు.
