శ్రీశైలంలో వైభవంగా శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది వేడుకలు

జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా

సత్యం వార్త / నంద్యాల జిల్లా బ్యూరో / మార్చి 19 :

శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీశైల మహా క్షేత్రంలో ఉగాది ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో గురువారం శ్రీశైల దేవస్థానంలోని అలంకార మండపంలో ఈ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి, దేవస్థాన కార్యనిర్వహణాధికారి శ్రీనివాసులు, ఆలయ ధర్మకర్తల మండలి సభ్యులు మరియు ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. పండితుల మంత్రోచ్ఛారణల మధ్య పూజా కార్యక్రమాలు నిర్వహించి జ్యోతి ప్రజ్వనలతో ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు.

ఈ సందర్భంగా పంచాంగ శ్రవణకర్త డాక్టర్ భుట్టా వీరభద్ర దైవజ్ఞ ఉగాది పంచాంగ శ్రవణాన్ని పఠించారు. రాబోయే సంవత్సరంలో ప్రభుత్వానికి ఎదురయ్యే పరిస్థితులు, సమాజానికి సంబంధించిన శుభాశుభ ఫలితాలను విశదీకరిస్తూ దిశానిర్దేశం చేశారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి ప్రజలందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ, నంద్యాల జిల్లా అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. జిల్లా ధనధాన్యాలతో, పాడిపంటలతో సుసంపన్నంగా వర్ధిల్లాలని, యువత అందుబాటులో ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకుని ప్రగతికి దోహదపడాలని సూచించారు. ప్రజలందరూ ఆరోగ్యంగా, ఆనందంగా జీవించాలని ఆకాంక్షించారు. పంచాంగ శ్రవణకర్త అందించిన సూచనలు సమాజానికి మార్గదర్శకంగా ఉండటమే కాకుండా, ప్రభుత్వ పాలనలో కూడా ఉపయుక్తమవుతాయని పేర్కొంటూ ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. గత 29 సంవత్సరాలుగా శ్రీశైలం దేవస్థానానికి ఆధ్యాత్మిక సేవలు అందిస్తున్న పంచాంగ శ్రవణకర్తను కలెక్టర్ మరియు దేవస్థాన ఈఓ ఘనంగా సన్మానించారు.

అనంతరం ఉగాది పర్వదినం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున నంద్యాల జిల్లాకు చెందిన ముగ్గురు అర్చకులు మరియు ఒక పేద పండితుడిని ఘనంగా సత్కరించారు. నంద్యాల మండలం పులిమద్ది గ్రామంలోని నాగేశ్వర స్వామి దేవస్థానం అర్చకులు మఠం శివశంకరయ్య, సిరివెళ్ల మండలం గోవిందపల్లి గ్రామంలోని శ్రీ కేశవ ఆంజనేయ స్వామి దేవస్థానం అర్చకులు ఇటిక్యాల వెంకటసుబ్బయ్య, జూపాడు బంగ్లా మండలం అలుగునూరు గ్రామంలోని శ్రీ చెన్నకేశవ ఆంజనేయ స్వామి దేవస్థానం అర్చకులు ఎం. త్రివేణి కుమార్, ఆత్మకూరు మండలం కేంద్రంలోని శ్రీ సిద్ధేశ్వర స్వామి దేవస్థానం పండితులు ఎం. మహేశ్వరయ్యలకు ఒక్కొక్కరికి రూ.10,116 నగదు పురస్కారంతో పాటు సంప్రదాయ దుస్తులైన పంచా, కండువా, శాలువాతో సన్మానం చేశారు. ఈ కార్యక్రమం ఆధ్యాత్మిక వాతావరణంలో విశేషంగా సాగి, భక్తులలో నూతన సంవత్సరానికి ఆనందం, ఆశలు నింపింది.

Scroll to Top