రోటా’ చికిత్సతో నలుగురు వృద్ధులకు పునర్జన్మ

సత్యం వార్త / నంద్యాల జిల్లా బ్యూరో / మార్చి 16 :
నంద్యాలలోని శాంతిరాం సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కార్డియాలజీ విభాగం వైద్య రంగంలో అరుదైన ఘనతలను సొంతం చేసుకుంటోంది. గుండె రక్తనాళాల్లో తీవ్రమైన కాల్షియం అడ్డంకులతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న నలుగురు వృద్ధులకు అత్యంత క్లిష్టమైన ‘రోటా’ (Rotablation) ప్రక్రియను విజయవంతంగా నిర్వహించి వైద్యులు కొత్త జీవితాన్ని ప్రసాదించారు. నంద్యాలకు చెందిన ఎన్. రంగ లక్ష్మమ్మ (83 ఏళ్లు) మరియు దువ్వూరు మండలం, ఇడమడక గ్రామానికి చెందిన ఎం. సావిత్రమ్మ (70 ఏళ్లు) గుండె సమస్యలతో శాంతిరాం ఆస్పత్రిలో చేరారు. వీరి రక్తనాళాల్లో కాల్షియం రాయిలా పేరుకుపోవడంతో సాధారణ స్టెంటింగ్ చేయడం సాధ్యపడలేదు. ఈ నేపథ్యంలో కార్డియాలజిస్టులు డాక్టర్ టి. నిషితా రెడ్డి, డాక్టర్ ఈ. నిఖిల్ ప్రవీణ్ ఆధ్వర్యంలోని వైద్య బృందం వీరికి అత్యంత నైపుణ్యంతో ‘రోటా’ చికిత్స నిర్వహించి ప్రాణాపాయం నుంచి తప్పించారు.
గతంలోనూ విజయవంతమైన చికిత్సలు:
కాగా, ఇదే తరహా క్లిష్టమైన సమస్యతో బాధపడుతున్న నంద్యాల ప్రాంతానికి చెందిన పెద్దా లింగమయ్య మరియు బీకర్ బీ అనే రోగులకు కూడా గత జనవరి నెలలో వైద్యులు విజయవంతంగా ‘రోటా’ ప్రొసీజర్లు నిర్వహించారు. వరుసగా ఇలాంటి సంక్లిష్టమైన కేసులు విజయం సాధించడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.
వైద్యుల వివరణ:
ఈ సందర్భంగా వైద్యులు మాట్లాడుతూ.. “వృద్ధాప్యంలో కాల్షియం వల్ల గట్టిపడిన రక్తనాళాలను క్లియర్ చేయడానికి ‘రోటా’ టెక్నాలజీ ఎంతో కీలకం. సాధారణంగా ఇలాంటి చికిత్సల కోసం హైదరాబాద్ వంటి మెట్రో నగరాలకు వెళ్లాల్సి ఉంటుంది. కానీ శాంతిరాం హాస్పిటల్లోని అత్యాధునిక క్యాథ్ ల్యాబ్ వసతులతో, తక్కువ ఖర్చుతో స్థానికంగానే ఈ క్లిష్టమైన చికిత్సలను అందిస్తున్నాం. ప్రస్తుతం రోగులందరూ కోలుకొని క్షేమంగా ఉన్నారు,” అని తెలిపారు.
అత్యంత నైపుణ్యంతో చికిత్సలు అందిస్తున్న వైద్య బృందాన్ని శాంతిరాం హాస్పిటల్ యాజమాన్యం మరియు రోగుల కుటుంబ సభ్యులు ప్రత్యేకంగా అభినందించారు.
