మహిళల సాధికారతతోనే సమాజ అభివృద్ధి – మంత్రి ఎన్ఎండి ఫరూక్

ప్రతి రంగంలో మహిళలకు సమాన అవకాశాలే ప్రభుత్వ లక్ష్యం – మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి

సత్యం వార్త / నంద్యాల జిల్లా బ్యూరో / మార్చి 08 :

మహిళలు సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాల్లో ముందుకు రావడమే సమాజ పురోగతికి పునాది అని జిల్లా మంత్రులు ఎన్ఎండి ఫరూక్, బీసీ జనార్దన్ రెడ్డిలు పేర్కొన్నారు. ఆదివారం నంద్యాల పట్టణంలోని మునిసిపల్ టౌన్ హాలులో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకల్లో మంత్రులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా రాష్ట్ర న్యాయ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ మాట్లాడుతూ చదువు మనిషి జీవితాన్ని మార్చగల శక్తి అని పేర్కొన్నారు. విద్య లేనివాడు ప్రపంచంలో అవకాశాలను సద్వినియోగం చేసుకోలేడని, ప్రతి కుటుంబం పిల్లల విద్యపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. ముఖ్యంగా మహిళల విద్యాభివృద్ధి ఇంకా పెరగాల్సిన అవసరం ఉందని, గ్రామీణ ప్రాంతాల్లో మహిళల చదువును ప్రోత్సహించాల్సిన బాధ్యత సమాజంపై ఉందన్నారు. ఇంజనీరింగ్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసినప్పటికీ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న యువతిలో చాలా మంది మహిళలే ఉన్నారని ఆయన తెలిపారు. వివాహం అయిన తర్వాత కూడా పిల్లలను చూసుకుంటూ చదువు కొనసాగిస్తూ పరీక్షలకు హాజరవుతున్న మహిళల పట్టుదల అభినందనీయం అన్నారు. గత కొన్నేళ్లుగా నిలిచిపోయిన డీఎస్సీ పరీక్షలను మళ్లీ నిర్వహించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని మంత్రి తెలిపారు. ఉపాధ్యాయ నియామకాల ప్రక్రియ ప్రారంభం కావడం వల్ల యువతకు మంచి అవకాశాలు కలుగుతాయని చెప్పారు. ఇటీవల నిర్వహించిన పరీక్షలకు హాజరైన అభ్యర్థుల్లో మహిళలు అధిక శాతం ఉండటం మహిళల చైతన్యాన్ని సూచిస్తుందని పేర్కొన్నారు.

ప్రస్తుతం దేశంలో జనన రేటు తగ్గిపోతున్న నేపథ్యంలో మానవ వనరుల అభివృద్ధి ఎంతో కీలకమని మంత్రి ఎన్ఎండి ఫరూక్ తెలిపారు. యువత సంఖ్య పెరిగితేనే దేశ ఆర్థిక వ్యవస్థ బలపడుతుందని, సమతుల్య జనాభా దేశ అభివృద్ధికి అవసరమని పేర్కొన్నారు. మహిళల ఆర్థిక స్వావలంబన కోసం ప్రభుత్వం బ్యాంకింగ్ వ్యవస్థ ద్వారా వేల కోట్ల రూపాయల సహాయాన్ని అందిస్తోందని ఆయన తెలిపారు. మహిళలు స్వయం ఉపాధి ద్వారా కుటుంబాలను నిలబెట్టడమే కాకుండా సమాజానికి ఆదర్శంగా నిలుస్తున్నారని అన్నారు. ఒక ముస్లిం మహిళ తన కృషితో సంవత్సరానికి దాదాపు రూ.36 లక్షల ఆదాయం సంపాదిస్తూ వందలాది మందికి ఉపాధి కల్పిస్తున్న ఉదాహరణను మంత్రి ప్రస్తావించారు. ఇలాంటి మహిళలు సమాజానికి ప్రేరణగా నిలుస్తారని, వారిని ప్రభుత్వం ఎల్లప్పుడూ ప్రోత్సహిస్తుందని తెలిపారు. ఆడపిల్లల వివాహాల కోసం ‘షాదీ ముబారక్’ వంటి పథకాల ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు చెందిన పేద కుటుంబాలకు ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తోందని మంత్రి వివరించారు. మహిళల సంక్షేమం, భద్రత కోసం ప్రభుత్వం అనేక కార్యక్రమాలు అమలు చేస్తోందన్నారు. ప్రస్తుతం నిర్మాణ రంగం సహా అనేక ఉపాధి రంగాల్లో ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన కార్మికులు ఎక్కువగా పనిచేస్తున్నారని మంత్రి పేర్కొన్నారు. ఒక ఇంటి నిర్మాణంలోనే అనేక రకాల పనులు ఉంటాయని, వాటిని నేర్చుకుంటే స్థానిక యువతకు మంచి ఆదాయం లభిస్తుందని సూచించారు. యువత నైపుణ్యాలను పెంపొందించుకుని అందుబాటులో ఉన్న అవకాశాలను వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు.

మహిళల పురోగతే నిజమైన అభివృద్ధి – రోడ్లు, భవనాలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్రంలోని మహిళలందరికీ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. మహిళలు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా ఎదిగినప్పుడే నిజమైన అభివృద్ధి సాధ్యమని అన్నారు. మహిళలకు ఆస్తిలో సమాన హక్కులు కల్పించిన చారిత్రక నిర్ణయం తీసుకున్న నాయకుడు ఎన్టీఆర్ అని ఆయన గుర్తు చేశారు. మహిళా సాధికారత కోసం ముఖ్యమంత్రి నాయకత్వంలో ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందన్నారు. మహిళల ఆర్థికాభివృద్ధి కోసం ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తోందని మంత్రి తెలిపారు. ఉచిత బస్సు సౌకర్యం, తల్లికి వందనం కార్యక్రమం, ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ వంటి పథకాల ద్వారా మహిళలకు ఉపశమనం కల్పిస్తున్నామని చెప్పారు. ఇప్పటికే మహిళలు వ్యవసాయం, వ్యాపారం, స్వయం ఉపాధి వంటి అనేక రంగాల్లో పురుషులతో సమానంగా ముందుకు సాగుతున్నారని మంత్రి పేర్కొన్నారు. ఒకప్పుడు ఇంటికే పరిమితమైన మహిళలు ఇప్పుడు ఎంటర్‌ప్రెన్యూర్లుగా ఎదుగుతూ సమాజానికి ఆదర్శంగా నిలుస్తున్నారని అన్నారు. మహిళలు తమలోని ప్రతిభను వెలికి తీసుకుని మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని మంత్రి ఆకాంక్షించారు. అంతకుముందు మంత్రులు స్వయం సహాయక సంఘాల మహిళలు తమ ఉత్పత్తులను ప్రదర్శించిన స్టాళ్లను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో స్త్రీ శిశు సంక్షేమ అభివృద్ధి అధికారి లీలావతి, మున్సిపల్ కమిషనర్ శేషన్న, డిఆర్డిఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీధర్ రెడ్డి, మెప్మా పీడీ వెంకట దాసు తదితర జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Scroll to Top