బుడగ జంగాల కాలనీ బాధితులకు మెరుగైన వైద్యం అందించండి – మంత్రి ఎన్ఎండి ఫరూక్ ఆదేశం

సత్యం వార్త / నంద్యాల జిల్లా బ్యూరో / మార్చి 24 :

నంద్యాల పట్టణంలోని వైయస్సార్ నగర్ బుడగ జంగాల కాలనీలో నిన్న రాత్రి చోటుచేసుకున్న ఫుడ్ పాయిజన్ ఘటన చాలా బాధాకరమని రాష్ట్ర న్యాయ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్  అన్నారు . ప్రస్తుతం నెల్లూరు జిల్లా పర్యటనలో ఉన్న మంత్రి ఫరూక్ ఘటన గురించి తెలిసిన వెంటనే అధికారులతో ఫోన్ ద్వారా మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. బాధితులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా తక్షణమే మెరుగైన వైద్య సేవలు అందించాలని మంత్రి ఫరూక్ అధికారులను ఆదేశించారు. నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి తో ఫోన్ లో మాట్లాడిన మంత్రి ఫరూక్ ఘటన తీవ్రతను అడిగి తెలుసుకొని, బాధితులకు అవసరమైన అన్ని సహాయక చర్యలు చేపట్టాలని సూచించారు. నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ మరియు విధుల్లో ఉన్న వైద్యులతో మాట్లాడి, చికిత్స పొందుతున్న వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. వారికి మెరుగైన వైద్యం అందేలా చూడాలని ఆదేశించారు.

ఈ సందర్భంగా మంత్రి ఫరూక్ మాట్లాడుతూ బాధితులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. “ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుంది. ఎవరికీ ఎటువంటి ప్రాణాపాయం కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాం,” అని తెలిపారు . తెలుగుదేశం పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు వెంటనే స్పందించి, బాధితులకు అవసరమైన సదుపాయాలను కల్పించాలని మరియు వారికి ధైర్యం చెప్పాలని మంత్రి ఫరూక్ సూచించారు. ప్రజారోగ్యం విషయంలో ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని ఆయన స్పష్టం చేశారు.

Scroll to Top