ప్రజా సేవల్లో 80% సానుకూలత లక్ష్యం
జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి


సత్యం వార్త / నంద్యాల జిల్లా బ్యూరో / ఫిబ్రవరి 25:
భూసమస్యలకు సంబంధించి పెండింగ్ మ్యుటేషన్లను గడువులోగా పరిష్కరించేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి రెవెన్యూ అధికారులను ఆదేశించారు. బుధవారం రాత్రి కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో మండల తాసిల్దార్లకు రెెవెన్యూ అంశాలపై సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రెవెన్యూ అంశాల్లో ప్రభుత్వ ఆదేశాల అమలు, క్షేత్రస్థాయి సమస్యల పరిష్కారం, ప్రజా సేవల మెరుగుదల వంటి అంశాలపై అధికారులకు స్పష్టమైన దిశానిర్దేశాలు జారీ చేశారు. పెండింగ్‌లో ఉన్న మ్యుటేషన్లను తక్షణమే పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. రీసర్వే పూర్తయిన గ్రామాల్లో భూ రికార్డుల నమోదు ప్రక్రియను గడువులోగా ముగించాలని స్పష్టం చేశారు. సర్వీస్ లెవల్ అగ్రిమెంట్ (SLA) గడువులు దాటకుండా ప్రతి దరఖాస్తును సమయపాలనతో పరిష్కరించాలని తెలిపారు. కోటపాడు వంటి గ్రామాల్లో రికార్డుల నమోదులో చోటుచేసుకున్న పొరపాట్లను గమనించిన కలెక్టర్, బాధితులకు తక్షణ న్యాయం చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రజలు ఇబ్బందులు పడకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పట్టాదారు పాస్బుక్కుల పంపిణీలో ఉన్న పెండింగ్‌ను పూర్తిగా క్లియర్ చేయాలన్నారు.
ప్రభుత్వ సేవలపై ప్రజల సానుకూల భావన 80 శాతం పైగా పెంచేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ‘హౌసింగ్ ఫర్ ఆల్’ పథకం కింద అర్బన్ ప్రాంతాల్లో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్ల చొప్పున స్థల సర్దుబాటు, కొత్త ఇంటి స్థలాల సేకరణపై సమగ్ర నివేదిక సమర్పించాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. పని ఒత్తిడిని సమర్థవంతంగా ఎదుర్కొంటూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కలెక్టర్ సూచించారు. క్షేత్రస్థాయిలో ఎదురయ్యే సమస్యలను వెంటనే జాయింట్ కలెక్టర్ లేదా జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకురావాలని తెలిపారు. ప్రజా సేవలలో పారదర్శకత, వేగం, నాణ్యత ఉండేలా ప్రతి అధికారి కట్టుబడి పనిచేయాలని ఆమె స్పష్టం చేశారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ కొల్లా బత్తుల కార్తిక్, డిఆర్ఓ రామునాయక్ తదితరులు పాల్గొన్నారు.
