పశు వసతి గృహాలకు స్థల సేకరణ చేపట్టాలి

జంతువుల జనన నియంత్రణ చర్యలు అత్యవసరం

వీధి శునకాలకు వాక్సినేషన్, స్టెరిలైజేషన్ తప్పనిసరి

అక్రమ గోవధశాలలపై కఠిన చర్యలు

  • జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా

సత్యం వార్త / నంద్యాల జిల్లా బ్యూరో / ఫిబ్రవరి 03 :

జిల్లాలో ప్రమాదాల వల్ల గాయపడిన జంతువుల సంరక్షణ కోసం అవసరమైన పశు వసతి గృహాల ఏర్పాటుకు తగిన స్థల సేకరణ చేపట్టాలని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో సోమవారం జిల్లా జంతు సంరక్షణ చట్టం కింద ఏర్పాటైన డిస్ట్రిక్ట్ సొసైటీ ఫర్ ప్రివెన్షన్ ఆఫ్ క్రూయెల్టీ టు యానిమల్స్ (డీఎస్పీసీఏ) సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా పశు సంవర్థక శాఖ అధికారి గోవింద నాయక్, మున్సిపల్ కమిషనర్ శేషన్న, డిపిఓ లలితాబాయి, డిఈఓ జనార్దన్ రెడ్డి, జంతు సంరక్షణ కమిటీ సభ్యులు లక్ష్మినారాయణ, అఖిల, బసవరాజు తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో పశువుల ఆహార సరఫరా, గోశాలల నిర్వహణ, వీధి శునకుల నియంత్రణకు అవసరమైన నిధుల సమీకరణపై సమగ్ర, వ్యూహాత్మక ప్రణాళిక రూపొందించాలని అధికారులకు సూచించారు. జిల్లాలో సుమారు 30 వేల వీధి కుక్కలు ఉన్నాయని, వీటి కారణంగా నందికొట్కూరు, బనగానపల్లె, బేతంచర్ల మండలాల్లో కుక్కల కాటుతో చిన్నారులు ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు చోటుచేసుకున్నాయని తెలిపారు. ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని జంతువుల జనన నియంత్రణ చర్యలు తప్పనిసరిగా చేపట్టాలని, ముఖ్యంగా వీధి కుక్కలకు స్టెరిలైజేషన్ మరియు వాక్సినేషన్ కార్యక్రమాలు నిరంతరంగా నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించారు. అనంతరం జంతు సంరక్షణ కమిటీ సభ్యులు లక్ష్మినారాయణ, అఖిల మాట్లాడుతూ, వాక్సినేషన్ కోసం పట్టుకున్న కుక్కలను తిరిగి అదే వీధిలో వదిలేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే స్టెరిలైజేషన్ గన్స్ వినియోగం, వాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం చేయడం, అక్రమ గోవధశాలల నిర్మూలన దిశగా కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను కోరారు. దీనిపై స్పందించిన జిల్లా కలెక్టర్, అక్రమ కార్యకలాపాలపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

కమిటీ సభ్యుడు బసవరాజు మాట్లాడుతూ, నంద్యాల పట్టణంలో వివిధ ప్రాంతాల్లో అక్రమ గోవధ మరియు నందుల వధశాలలు కొనసాగుతున్నాయని తెలిపారు. మూడో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో గాంధీనగర్ నుంచి రైల్వే లైన్ వరకు ప్రతి శనివారం ఉదయం ఐదు అక్రమ వధశాలలు పనిచేస్తున్నాయని, రెండో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో జోసెఫ్ కాన్వెంట్ సమీపంలో ప్రతి శనివారం రాత్రి అక్రమ గోవధ జరుగుతోందని వివరించారు. అలాగే ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని నడిగడ్డ ప్రాంతంలో సుమారు 12 అక్రమ వధశాలల్లో గర్భంతో ఉన్న గోవులను కూడా బహిరంగంగానే వధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చాంద్ బాడ ప్రాంతంలో రోజూ రోడ్డుపై గోమాంసం విక్రయం జరుగుతోందని, ఆంజనేయ స్వామి ఆలయం సమీపంలో, ప్రభుత్వ ఆసుపత్రి పక్కన, పెద్ద కూరగాయల మార్కెట్ వద్ద కూడా అక్రమ వధశాలలు కొనసాగుతున్నాయని, వీటిపై తక్షణ చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను కోరారు. స్వయంగా ఆకస్మిక తనిఖీలు నిర్వహించి కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ మున్సిపల్ కమిషనర్ ను ఆదేశించారు. అంతకుముందు జిల్లా పశు సంవర్థక శాఖ అధికారి జంతు సంరక్షణ చట్టం కింద ఏర్పడిన కమిటీ యొక్క నియమ నిబంధనలు, విధి నిర్వహణ వివరాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సభ్యులకు వివరించారు.

Scroll to Top