పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు రాయనున్న విద్యార్థులకు జిల్లా కలెక్టర్ శుభాకాంక్షలు

ఆత్మవిశ్వాసం, సమయపాలనతో పరీక్షలను ఎదుర్కోవాలి – జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి గణియా

సత్యం వార్త / నంద్యాల జిల్లా బ్యూరో / మార్చి 13 :

మార్చి నెలలో నిర్వహించనున్న పదవ తరగతి పబ్లిక్ పరీక్షలకు హాజరుకానున్న జిల్లాలోని సుమారు 25,035 మంది విద్యార్థులకు జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి శుభాకాంక్షలు తెలిపారు. విద్య మనిషిని ఎక్కడైనా గౌరవనీయుడిగా నిలబెడుతుందని పేర్కొంటూ, పదవ తరగతి పరీక్షలు విద్యార్థుల భవిష్యత్తుకు తొలి మెట్టు అని ఆమె అన్నారు. సమయపాలనకు ప్రాధాన్యత ఇవ్వాలి.. పరీక్షల ముందు మరియు పరీక్షల మధ్య ఉన్న సమయాన్ని సమర్థవంతంగా వినియోగించుకుని పాఠాలను పునశ్చరణ చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. సమయపాలనతో చదువుకు ప్రణాళిక రూపొందించుకుంటే మంచి ఫలితాలు సాధించవచ్చని తెలిపారు.  ఆత్మవిశ్వాసమే విజయానికి మూలం..విద్యార్థులు తమపై నమ్మకం ఉంచుకుని ధైర్యంగా పరీక్షలను ఎదుర్కోవాలని కలెక్టర్ అన్నారు. చిన్న చిన్న సమస్యలు ఎదురైనా దిగులు పడకుండా పట్టుదలతో ముందుకు సాగితే విజయం సాధించగలరని సూచించారు..

చక్కటి చేతిరాతతో సమాధానాలు రాయాలి..పరీక్షల సమయంలో ప్రశ్నలను పూర్తిగా అర్థం చేసుకుని స్పష్టంగా, చక్కటి చేతిరాతతో సమాధానాలు రాయాలని ఆమె సూచించారు. ఇలా రాయడం ద్వారా మూల్యాంకనం చేసే వారికి సమాధానాలు సులభంగా అర్థమై మంచి మార్కులు పొందే అవకాశం ఉంటుందని తెలిపారు..

ఆరోగ్యంపై దృష్టి పెట్టాలి..పరీక్షల సమయంలో విద్యార్థులు ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు పౌష్టికాహారం తీసుకోవడం, తగినంత నిద్ర తీసుకోవడం ఎంతో అవసరమని కలెక్టర్ పేర్కొన్నారు. ఆరోగ్యంగా ఉంటే పరీక్షలను మరింత సమర్థవంతంగా రాయగలరని తెలిపారు.

జిల్లాకు మంచి పేరు తీసుకురావాలి..జిల్లాలోని విద్యార్థులు అత్యుత్తమ మార్కులు సాధించి తమ తల్లిదండ్రులు, ఉపాధ్యాయులకు ఆనందాన్ని కలిగించడంతో పాటు నంద్యాల జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి గణియా ఆకాంక్షించారు. విద్యార్థులందరికీ విజయాన్ని కోరుతూ ఆమె శుభాకాంక్షలు తెలిపారు.

Scroll to Top