అమరావతికి చట్టబద్ధమైన భరోసా

సత్యం వార్త / నంద్యాల జిల్లా బ్యూరో / ఏప్రిల్ 04 :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏకైక రాజధానిగా అమరావతికి చట్టపరమైన భరోసా కల్పిస్తూ, రాజ్యసభలో ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్ట సవరణ బిల్లు ఆమోదం పొందడం పట్ల రాష్ట్ర న్యాయ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ హర్షం వ్యక్తం చేశారు. పార్టీ అధిష్టానం పిలుపు మేరకు శనివారం నంద్యాలలోని గాంధీ చౌక్ వద్ద గల తన నివాసంలో “జై అమరావతి” అంటూ మంత్రి ఫరూక్ దీపం వెలిగించి సంబరాలు నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి ఎన్ఎండి ఫరూక్ మాట్లాడుతూ అమరావతిని పూర్తిస్థాయి రాజధానిగా ఖరారు చేస్తూ రాష్ట్ర అసెంబ్లీతో పాటు, కేంద్రంలోని ఉభయ సభలలో పునర్విభజన చట్ట సవరణ చేయడం రాష్ట్ర భవిష్యత్తుకు శుభసూచకమని ఆయన తెలిపారు. అమరావతికి చట్టబద్ధత కల్పించడంలో విశేష కృషి చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కి , ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కి , ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ కి , మరియు మంత్రి నారా లోకేష్ కు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ప్రపంచస్థాయి రాజధాని నిర్మాణానికి స్వచ్ఛందంగా భూములిచ్చిన అమరావతి అన్నదాతలకు మంత్రి ఫరూక్ కృతజ్ఞతలు తెలియజేశారు. రైతుల త్యాగం రాష్ట్ర చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందన్నారు. అమరావతి ఇకపై కేవలం ఒక ప్రాంతం మాత్రమే కాదని, ఆంధ్రుల ఆత్మగౌరవానికి ప్రతీకగా, ప్రపంచం గర్వించదగ్గ నగరంగా రూపుదిద్దుకుంటుందని మంత్రి ఫరూక్ ధీమా వ్యక్తం చేశారు.
