నంద్యాలలో ఘనంగా బాబు జగ్జీవన్ రామ్ 118 వ జయంతి వేడుకలు

• బాబు జగ్జీవన్ రామ్ ఆశయాలు సమాజానికి మార్గదర్శకం – రాష్ట్ర న్యాయ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్.ఎం.డి. ఫరూక్

• యువత బాబు జగ్జీవన్ రామ్ ను ఆదర్శంగా తీసుకోవాలి – జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా

• ఘనంగా నివాళులర్పించిన మంత్రి ఎన్ఎండి ఫరూక్, కలెక్టర్ రాజకుమారి, ఏఎస్పీ మంద జావలి అల్ఫోన్స్‌

సత్యం వార్త / నంద్యాల జిల్లా బ్యూరో / ఏప్రిల్ 05 :

భారత మాజీ ఉపప్రధాని, స్వాతంత్ర్య సమరయోధుడు, డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ 118 వ జయంతి వేడుకలు ఆదివారం నంద్యాల పట్టణంలో ఘనంగా నిర్వహించబడ్డాయి. నంద్యాల ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని విక్టోరియా రీడింగ్ రూమ్ వద్ద ఉన్న బాబు జగ్జీవన్ రామ్ విగ్రహానికి రాష్ట్ర న్యాయ మరియు మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ , జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా, నంద్యాల ఏఎస్పీ మంద జావలి అల్ఫోన్స్‌ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, సామాజిక న్యాయం మరియు సమానత్వం కోసం బాబు జగ్జీవన్ రామ్ చేసిన సేవలు చిరస్మరణీయమని అన్నారు. ఆయన ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆచరణలో పెట్టాలని పిలుపునిచ్చారు. పూర్వం సమాజంలో ఉన్న అసమానతలను గుర్తుచేసుకుంటూ, మానవ గౌరవాన్ని కాపాడేందుకు జరిగిన మార్పులు ఎంతో కీలకమని చెప్పారు. ఒకప్పుడు మనుషులే మలమూత్రాలను మోసే పరిస్థితులు ఉండేవని, అలాంటి దృశ్యాలు ఎంతో బాధ కలిగించేవని గుర్తు చేసుకున్నారు. అప్పటి పరిస్థితుల్లో సామాజిక మార్పులకు శ్రీకారం చుట్టిన నేతల్లో ఎన్టీ రామారావు ఒకరని మంత్రి కొనియాడారు. హైదరాబాద్ ట్యాంక్‌బండ్ వద్ద బాబు జగ్జీవన్ రామ్ విగ్రహాన్ని ఏర్పాటు చేయించిన ఘనత ఆయనదేనని తెలిపారు. ఎస్సీ వర్గీకరణ, రిజర్వేషన్ అంశాలపై సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో మాట్లాడుతూ, న్యాయ వ్యవస్థను గౌరవించాల్సిన బాధ్యత అందరిదేనని, అయితే బాధిత వర్గాల హక్కుల పరిరక్షణ కోసం ప్రభుత్వాలు కట్టుబడి ఉండాలని అన్నారు. అన్ని రాజకీయ పార్టీల నాయకులు కలిసి ప్రజల సమస్యలను ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. బాబు జగ్జీవన్ రామ్ దేశానికి ప్రధానమంత్రి కావాల్సిన వ్యక్తి అని, కానీ కొన్ని పరిస్థితుల వల్ల ఆ అవకాశం కోల్పోయారని అభిప్రాయపడ్డారు.

రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా అభివృద్ధి చేసి, సుస్థిర వ్యవసాయం ద్వారా ఆర్థికాభివృద్ధిని పెంచాలని తెలిపారు. హరిత విప్లవానికి బాబు జగ్జీవన్ రామ్ చేసిన సేవలను గుర్తుచేశారు. భారతరత్నకు డిమాండ్ బాబు జగ్జీవన్ రామ్ మరియు ఎన్టీ రామారావుకు భారతరత్న పురస్కారం ప్రదానం చేయాలని డిమాండ్ చేస్తూ, ఇందుకు సంబంధించిన ఉద్యమాన్ని కొనసాగిస్తామని మంత్రి తెలిపారు. రాబోయే రోజుల్లో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి మాట్లాడుతూ, బాబు జగజ్జీవన్ రామ్ జీవితం సమాజానికి మార్గదర్శకమని పేర్కొన్నారు. అట్టడుగున ఉన్న వర్గాల అభ్యున్నతికి ఆయన చేసిన కృషి స్ఫూర్తిదాయకమని, యువత ఆయనను ఆదర్శంగా తీసుకొని లక్ష్యసాధన దిశగా ముందుకు సాగాలని సూచించారు. సమాజంలో కార్మిక చట్టాల ప్రాముఖ్యతను వివరిస్తూ, చట్టాల సహాయంతో సాధారణ వ్యక్తి కూడా ఉన్నత స్థాయికి ఎదగవచ్చని, దీనికి బాబూజీ జీవితం గొప్ప ఉదాహరణగా నిలుస్తుందని అన్నారు. ప్రస్తుతం వివిధ లేబర్ యూనియన్లు సమస్యల పరిష్కారంలో ఐక్యతతో ముందుకు రావడానికి కార్మిక చట్టాలే పునాది అని కలెక్టర్ పేర్కొన్నారు. అలాగే వ్యవసాయం మరియు ఆర్థిక అభివృద్ధిపై దృష్టి సారిస్తూ, రాయలసీమ ప్రాంతాన్ని హార్టికల్చర్ హబ్‌గా అభివృద్ధి చేయడం ద్వారా జీడీపీ వృద్ధి సాధ్యమవుతుందని, సుస్థిర వ్యవసాయం దిశగా ప్రణాళికాబద్ధ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఈ అభివృద్ధికి బాబూజీ హయాంలో జరిగిన హరిత విప్లవం పునాది వేసిందని, ఆ అవగాహనను మరింతగా విస్తరించుకోవాలని సూచించారు.

బాబు జగజ్జీవన్ రామ్ సేవలను స్మరించుకుంటూ, 1971 ఇండో-పాక్ యుద్ధ సమయంలో రక్షణ మంత్రిగా ఆయన చూపిన నాయకత్వం దేశ చరిత్రలో చిరస్మరణీయమని, అలాగే రైల్వే శాఖా మంత్రిగా మరియు ఉప ప్రధానమంత్రిగా కూడా ఆయన విశిష్ట సేవలు అందించారని కలెక్టర్ కొనియాడారు. పుస్తక పఠనం, అనుభవజ్ఞులతో సంభాషణ మరియు పరిసరాల పట్ల అవగాహన ద్వారా ఆయన జ్ఞానాన్ని పెంపొందించుకుని అంచెలంచెలుగా ఎదిగారని తెలిపారు. సమాజంలోని ప్రతి వ్యక్తి దేశాభివృద్ధిలో భాగస్వామి కావాలన్నది ఆయన ఆకాంక్ష అని గుర్తుచేశారు. జీవితంలో ఎదురయ్యే చిన్న చిన్న ఆటంకాలను అధిగమించే ధైర్యం మరియు పట్టుదల ఉంటే ఎవరికైనా ఉన్నత స్థాయికి చేరుకోవడం సాధ్యమని పేర్కొన్నారు. ఈ సమావేశంలో కొమ్ముపాలెం శ్రీనివాసులు, మేకల లింగస్వామి, ఏ. చిన్న వెంకట సుబ్బయ్య, దండు వీరయ్య, ఎన్. లక్ష్మన్న, బి. బెనర్జీ, ఎస్. జీవన్ రాజ్, చెన్నమ్మ, రవికాంత్, సి.ఏం. శ్రీనివాసులు, జి. బాలస్వామి, జిల్లా విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులు బాలనాగన్న, నాగరాజు, కాశన్న, దేవదానం, రవికాంత్ బాబు, వెంకటేష్ నాయక్, మురళి, కర్మచారి సంఘ సభ్యులు తదితరులు పాల్గొని ప్రసంగించారు.

Scroll to Top