
సత్యం వార్త / నంద్యాల జిల్లా బ్యూరో / మార్చి 20 :
శుక్రవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా నంద్యాల మున్సిపాలిటీకి ప్రత్యేక అధికారిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ శేషన్న, ఎమ్.ఈ గురప్ప యాదవ్, డీఈ పవన్ కుమార్, టౌన్ ప్లానింగ్ అధికారి నరసింహ మూర్తి తదితర సంబంధిత శాఖల అధికారులు కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మున్సిపాలిటీ పరిధిలో ప్రజలకు మెరుగైన సేవలు అందించడంపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు సూచించారు. ముఖ్యంగా పారిశుద్ధ్యం, తాగునీటి సరఫరా, మౌలిక వసతుల అభివృద్ధి అంశాలలో ఎలాంటి నిర్లక్ష్యం ఉండకూడదని స్పష్టం చేశారు. పట్టణ ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రణాళికాబద్ధంగా పనులు చేపట్టాలని, అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేయాలని ఆదేశించారు. అలాగే ప్రజల సమస్యలను సమయానుకూలంగా పరిష్కరించేందుకు అధికారులు సమన్వయంతో పని చేయాలని సూచించారు. నగర అభివృద్ధి దిశగా పటిష్ట చర్యలు తీసుకుంటామని, ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా సేవలను మెరుగుపరుస్తామని కలెక్టర్ తెలిపారు.
