నంద్యాల పట్టణంలో చలివేంద్రాలు, చలువ పందిళ్లు ఎక్కడ

సత్యం వార్త / నంద్యాల జిల్లా ప్రతినిధి / మార్చి 07 :
వేసవి కాలం ప్రారంభమవడంతో నంద్యాల పట్టణంలో ఎండలు రోజురోజుకూ తీవ్రంగా పెరుగుతున్నాయి. ఉదయం 9 గంటలకే భానుడు మండిపడుతుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే ప్రజల దాహార్తిని తీర్చే చలివేంద్రాలు, చలువ పందిళ్లు మాత్రం పట్టణంలో ఎక్కడా కనిపించకపోవడం ప్రజల్లో ఆగ్రహాన్ని రేకెత్తిస్తోంది. ప్రతి ఏడాది వేసవి ప్రారంభమయ్యే సమయానికి పట్టణంలోని ప్రధాన కూడళ్లలో, నాలుగు రోడ్ల సెంటర్, బస్టాండ్ ఆవరణ, మున్సిపల్ కార్యాలయం, ఎమ్మార్వో కార్యాలయం, పోలీస్ స్టేషన్ ప్రాంతాల్లో చలివేంద్రాలు ఏర్పాటు చేయడం ఆనవాయితీ. అలాగే ట్రాఫిక్ సిగ్నల్ ప్రాంతాల్లో చలువ పందిళ్లు ఏర్పాటు చేసి బాటసారులు, వాహనదారులకు తాగునీరు అందించే ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది. కానీ ఈ సంవత్సరం ఎండలు తీవ్రంగా పెరుగుతున్నప్పటికీ మున్సిపల్ అధికారులు ఇప్పటివరకు ఎలాంటి చర్యలు చేపట్టలేదని ప్రజలు విమర్శిస్తున్నారు. బస్టాండ్ వద్ద బస్సు దిగి పట్టణంలోకి వెళ్లే ప్రయాణికులు తాగునీరు కోసం కిరాణా దుకాణాల్లో డబ్బులు పెట్టి నీటి బాటిళ్లు కొనుక్కోవాల్సిన పరిస్థితి నెలకొంది. రోజంతా కష్టపడే కార్మికులు, కూలీలు, చిరు వ్యాపారులు కూడా చుక్క నీటి కోసం ఇబ్బందులు పడుతున్నారు. మున్సిపాలిటీకి ప్రజలు చెల్లించే పన్నులు ఎక్కడికి వెళ్తున్నాయని పట్టణ వాసులు ప్రశ్నిస్తున్నారు. లక్షల రూపాయల బడ్జెట్ ఉన్నా కనీసం ఒక కుండ మంచినీరు, మజ్జిగ అందించే ఏర్పాట్లు కూడా చేయలేకపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగితాలకే పరిమితమయ్యే ప్రణాళికలు క్షేత్రస్థాయిలో ఎందుకు అమలు కావడం లేదని ప్రజలు నిలదీస్తున్నారు. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి పట్టణంలోని ప్రధాన కూడళ్లలో చలివేంద్రాలు, చలువ పందిళ్లు వెంటనే ఏర్పాటు చేసి ప్రజలకు ఉపశమనం కల్పించాలని వాహనదారులు, బాటసారులు కోరుతున్నారు

Scroll to Top