నంద్యాల జిల్లాలో ఫుడ్ కమిషన్ సభ్యులు ఈ.లక్ష్మీ రెడ్డి విస్తృత తనిఖీలు

సత్యం వార్త / నంద్యాల జిల్లా బ్యూరో /జనవరి 8 :
ఫుడ్ కమిషన్ సభ్యులు ఈ లక్ష్మీ రెడ్డి నంద్యాల జిల్లాలో రెండు రోజుల పర్యటనలో భాగంగా గురువారం ఉదయం నుంచి సాయంత్రం వరకు నందికొట్కూరు, జూపాడుబంగ్లా మరియు ఆత్మకూరు మండలాల్లో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు.
ఈ సందర్భంగా అంగన్వాడీ కేంద్రాలు, జడ్పీ పాఠశాలల్లో అమలవుతున్న మధ్యాహ్న భోజన పథకం (మిడ్ డే మీల్స్), ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టళ్లు, ఫెయిర్ ప్రైస్ షాపులు (ఎఫ్‌పీ షాపులు), కేజీబీవీ ఆశ్రమ పాఠశాలలు, అలాగే ఆత్మకూరు మండలంలోని కొత్తలచెరువు గిరిజన ఆశ్రమ పాఠశాలను పరిశీలించారు.
ముచ్చుమర్రి జడ్పీ పాఠశాలలో వంట నిర్వాహకులు భోజనం సరిగా తయారు చేయడంలేదని గుర్తించిన ఫుడ్ కమిషన్ సభ్యులు, సంబంధిత హెడ్‌మాస్టర్‌కు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. అలాగే ప్రతి రోజూ ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారమే భోజనం అందించాలని వంట నిర్వాహకులకు స్పష్టమైన సూచనలు ఇచ్చారు.
కొట్టాల చెరువు గిరిజన ఆశ్రమ పాఠశాలలో వంట సరుకుల నాణ్యత లోపంగా ఉన్నట్లు గుర్తించి, సంబంధిత హెడ్‌మాస్టర్‌కు హెచ్చరిక జారీ చేశారు. సరుకులు సరఫరా చేసే కాంట్రాక్టర్లతో మాట్లాడి, నాణ్యమైన నిత్యావసర సరుకులు మాత్రమే అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
ఈ కార్యక్రమంలో ఫుడ్ కమిషన్ సభ్యులతో పాటు జిల్లా సివిల్ సప్లయ్ అధికారి జె. రవి బాబు, సివిల్ సప్లయ్ మేనేజర్ అశ్వత్ నాయక్, ఫుడ్ సేఫ్టీ అధికారులు వెంటక రాముడు, లీగల్ మెట్రాలజీ అధికారులు మరియు విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు.

Scroll to Top