100 రోజుల ప్రత్యేక డ్రైవ్‌కు శ్రీకారం
చివరి ఆయకట్టు వరకు సాగునీటి సరఫరా లక్ష్యం
“యుక్తధార” ద్వారా పనుల పర్యవేక్షణ, జియో ట్యాగింగ్ తప్పనిసరి
జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా

సత్యం వార్త / నంద్యాల జిల్లా బ్యూరో / ఏప్రిల్ 06 :
జిల్లాలో నీటి భద్రత సాధన ప్రతి అధికారి ప్రధాన బాధ్యతగా భావించి సమిష్టిగా పనిచేయాలని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి అన్నారు. సోమవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాల్లో “నీటి భద్రత – సాగునీటి సంఘాల బాధ్యత” అనే అంశంపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో నెం.10 మేరకు జలవనరుల శాఖ ఆధ్వర్యంలో “నీటి భద్రత – సాగునీటి సంఘాల బాధ్యత” పేరుతో 100 రోజుల ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమం ఏప్రిల్ 6 నుంచి జూలై 14 వరకు కొనసాగుతుందని, దశలవారీగా అమలు చేయాలని సూచించారు. పనుల అమలు షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 6 నుంచి 15 వరకు పనుల గుర్తింపు, ఏప్రిల్ 16 నుంచి 20 వరకు మంజూరు ప్రక్రియ పూర్తి చేయాలని, ఏప్రిల్ 21 నుంచి జూలై 9 వరకు పనులను అమలు చేయాలని, చివరగా జూలై 10 నుంచి 14 వరకు రిపోర్టింగ్ మరియు డాక్యుమెంటేషన్ పూర్తి చేయాలని ఆదేశించారు. జిల్లాలో నీటి వనరుల సమర్థ వినియోగం, సాగునీటి అందుబాటు పెంపు, భూగర్భ జలాల అభివృద్ధి లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేయాలని పేర్కొన్నారు.
జిల్లా స్థాయిలో ఏర్పాటు చేసిన కన్వర్జెన్స్ కమిటీలో జలవనరుల శాఖ ఎస్ఈతో పాటు వ్యవసాయం, పశుసంవర్ధక, ఉద్యానవనం, పంచాయతీ రాజ్, ఆర్డబ్ల్యూఎస్, పబ్లిక్ హెల్త్, ఎంఎన్ఆర్ఈజీఎస్, మత్స్య శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. ఎంపీడీవోలు, తహశీల్దార్లు తమ నియోజకవర్గ ఎమ్మెల్యేలతో సమన్వయం చేసుకుని ఎంఎన్ఆర్ఈజీఎస్ కింద మంజూరైన పనులను వెంటనే ప్రారంభించాలని సూచించారు. కార్యక్రమ ప్రారంభానికి సంబంధించిన ఫోటోలను పకడ్బందీగా డాక్యుమెంట్ చేసి పంపించాలని తెలిపారు.
జిల్లాలో నీటి పారుదల వ్యవస్థపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కలెక్టర్ పేర్కొన్నారు. కృష్ణా నది నుంచి శ్రీశైలం, పోతిరెడ్డిపాడు ద్వారా విడుదలయ్యే నీరు కేసీ కెనాల్, తెలుగు గంగ, ఎస్ఆర్బీసీ కాలువల ద్వారా చివరి ఆయకట్టు వరకు చేరేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ముఖ్యంగా నందికొట్కూరు, డోన్ ప్రాంతాల్లో నీటి ఎద్దడి అధికంగా ఉన్నందున ప్రత్యేక ప్రణాళికలు అమలు చేయాలని తెలిపారు. పాములపాడు మండలంలో భూగర్భ జలాల తగ్గుదల దృష్ట్యా పునరుద్ధరణ చర్యలు వేగవంతం చేయాలని ఆదేశించారు. కాలువలు పూడికపోవడం, ఫీడర్ మరియు ఫీల్డ్ ఛానల్స్ దెబ్బతినడం వల్ల నీటి సరఫరాలో అంతరాయం కలుగుతోందని పేర్కొంటూ, పూడికతీత, బుష్ క్లియరెన్స్, కట్టల బలపరిచే పనులను చేపట్టాలని సూచించారు. జిల్లాలోని 330 మైనర్ ఇరిగేషన్ చెరువులను పూర్తి స్థాయిలో నీటితో నింపే లక్ష్యంతో కార్యాచరణ చేపట్టాలని ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో ఉపాధి హామీ పథకం (ఎంఎన్ఆర్ఈజీఎస్) కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొంటూ, ఎంపీడీవోలు సమర్థంగా అమలు చేయాలని సూచించారు. అన్ని పనులను “యుక్తధార” సాఫ్ట్వేర్ ద్వారా మానిటర్ చేస్తామని, ప్రతి పనికి జియో ట్యాగింగ్ తప్పనిసరి అని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి నేరుగా పర్యవేక్షణ ఉంటుందని తెలిపారు. పనుల ప్రతి దశను డ్రోన్ ఫోటోలు, హై రిజల్యూషన్ చిత్రాలు, నివేదికల రూపంలో సమగ్రంగా నమోదు చేయాలని ఆదేశించారు. జిల్లా, మండల, గ్రామ స్థాయిల్లో కమిటీలను ఏర్పాటు చేసి బాధ్యతలను స్పష్టంగా నిర్వచించినట్లు తెలిపారు. మండల స్థాయిలో ఎంపీడీవో, తహశీల్దార్లు, గ్రామ స్థాయిలో విఆర్ఓ, పంచాయతీ కార్యదర్శులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. చెరువుల ఆక్రమణలను తొలగించి నీటి వనరులను సంరక్షించడం అత్యంత ప్రాధాన్యంగా తీసుకోవాలని కలెక్టర్ పేర్కొన్నారు. సంజామల మండలం ఆకుమళ్ల వాటర్‌షెడ్ ప్రాజెక్ట్, డోన్‌లోని ఎత్తుపెంట ప్రాజెక్ట్‌లను అధికారులు సందర్శించి ‘రిడ్జ్ టు వ్యాలీ’ విధానంపై అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు. చెక్‌డ్యామ్‌లు, పెర్కొలేషన్ ట్యాంకులు, బోర్వెల్ రీచార్జ్ నిర్మాణాలపై దృష్టి సారించాలని, అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి పరిస్థితులను స్వయంగా పరిశీలించాలని ఆదేశించారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో ప్రాజెక్టుల ప్రారంభం, జియో ట్యాగింగ్ తక్షణమే చేపట్టాలని స్పష్టం చేశారు.
