
సత్యం వార్త / నంద్యాల జిల్లా ప్రతినిధి / ఏప్రిల్ 05 :
బీజేపీ ఆవిర్భావ దినోత్సవాన్ని జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించనున్నట్లు నంద్యాల జిల్లా బీజేపీ అధ్యక్షుడు అభిరుచి మధు తెలిపారు. సోమవారం ఉదయం జిల్లా కేంద్రంలో మాజీ ప్రధాని అటల్ బిహారి వాజపేయి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి కార్యక్రమాలను ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు. అనంతరం జిల్లా లోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో నిర్వహించే కార్యక్రమాల్లో స్వయంగా పాల్గొంటూ పార్టీ కార్యకర్తలకు దిశానిర్దేశం చేయనున్నట్లు ఆయన తెలిపారు. రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు జిల్లా మొత్తం మీద జెండా ఆవిష్కరణ కార్యక్రమాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయని చెప్పారు. జిల్లా అధ్యక్షుడు అభిరుచి మధు నాయకత్వంలో జరిగే ఈ వేడుకల్లో జిల్లా సీనియర్ నాయకులు, జిల్లా కమిటీ సభ్యులు, మండల అధ్యక్షులు, మోర్చా అధ్యక్షులు, పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొని పండుగ వాతావరణంలో కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు వివరించారు.
పార్టీ బలోపేతం కోసం ప్రతి కార్యకర్త కృషి చేయాలని, కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని అభిరుచి మధు పిలుపునిచ్చారు.
