కొలిమిగుండ్లలో ఉచిత మినరల్ వాటర్ ప్లాంట్ ప్రారంభం

సొంత నిధులతో రూ. 9 లక్షల వ్యయంతో వాటర్ ప్లాంట్ ఏర్పాటు

ప్రజలకు నాణ్యమైన తాగునీరు అందించడమే లక్ష్యం: మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి

ప్లాంట్ నీటిని స్వయంగా రుచి చూసి నాణ్యత పరిశీలించిన మంత్రి, కలెక్టర్

సేవా దృక్పథంతో చేపట్టిన కార్యక్రమం అభినందనీయం: కలెక్టర్ రాజకుమారి గణియా

సత్యం వార్త / నంద్యాల జిల్లా బ్యూరో / మే 02  :

ప్రజలకు నాణ్యమైన తాగునీరు అందించడమే లక్ష్యమని రోడ్లు భవనాలు, పెట్టుబడులు మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అన్నారు. శనివారం బనగానపల్లె నియోజకవర్గం కొలిమిగుండ్ల మండల కేంద్రంలో ప్రజలకు సురక్షితమైన తాగునీటిని అందించేందుకు ఏర్పాటు చేసిన ఉచిత మినరల్ వాటర్ ప్లాంట్‌ను ఆర్ అండ్ బి శాఖ మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి గారితో కలిసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ, ప్రజలకు సురక్షితమైన మరియు నాణ్యమైన తాగునీటిని అందించడమే ఈ ప్లాంట్ ఏర్పాటు లక్ష్యమని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో శుద్ధమైన నీటి కొరతను దృష్టిలో ఉంచుకుని, సేవా దృక్పథంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు మంత్రి వెల్లడించారు. ప్రారంభోత్సవం అనంతరం మంత్రి, కలెక్టర్ ఇద్దరూ స్వయంగా ప్లాంట్‌లో ఉత్పత్తి చేసిన మంచినీటిని తాగి నాణ్యతను పరిశీలించారు.

జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి మాట్లాడుతూ, మంత్రి గారు తన సొంత నిధులు రూ. 9 లక్షలతో ఈ మినరల్ వాటర్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయడం అభినందనీయమని పేర్కొన్నారు. సొంత నిధులతో ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఉచిత మినరల్ వాటర్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయడం వంటి సేవా కార్యక్రమాలు ఇతరులకు ఆదర్శంగా నిలుస్తాయని కలెక్టర్ అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు మరియు గ్రామస్థులు పాల్గొన్నారు.

Scroll to Top