భూగర్భ జలాల పెంపుతో సమగ్ర అభివృద్ధి లక్ష్యం

హనుమంతునిగుండం చెరువులో పూడికతీత పనులకు శ్రీకారం

‘జలధార – జలహారతి’తో జలమట్టం 3 మీటర్లు పెంపు లక్ష్యం

చెరువుల పునరుద్ధరణతో వ్యవసాయానికి కొత్త ఊపు

ఆర్ అండ్ బి శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి

సత్యం వార్త / నంద్యాల జిల్లా బ్యూరో (బనగానపల్లె) / మే 02  :

జిల్లాలో భూగర్భ జలాల పెంపు, వ్యవసాయ అభివృద్ధి మరియు ప్రజల భాగస్వామ్యంతో సమగ్ర అభివృద్ధి సాధించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రోడ్లు, భవనాలు, పెట్టుబడులు మరియు మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం కొలిమిగుండ్ల మండలంలోని హనుమంతునిగుండం చెరువులో పూడికతీత పనులను జిల్లా కలెక్టర్ జి. రాజకుమారితో కలిసి మంత్రి ప్రారంభించారు. ఈ సమావేశంలో ఇరిగేషన్  ఎస్ఈ శివశంకర్ రెడ్డి, డ్వామా పిడి సూర్యనారాయణ, భూగర్భ జిల్లా అధికారి రఘురాం, ఆర్డీఓ నరేంద్రనాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ‘జలధార–జలహారతి’ కార్యక్రమం ద్వారా భూగర్భ జల మట్టాన్ని కనీసం 3 మీటర్ల మేర పెంచే లక్ష్యంతో ప్రభుత్వం కృషి చేస్తున్నదని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా సమర్థవంతంగా అమలు చేస్తే భూమిలో నీటి నిల్వలు పెరిగి, వ్యవసాయం మరియు తాగునీటి సమస్యలకు దీర్ఘకాలిక పరిష్కారం లభిస్తుందని వివరించారు. శ్రీకృష్ణదేవరాయల కాలం నాటి చెరువులు, కుంటలను పునరుద్ధరించడం ద్వారా నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచవచ్చని మంత్రి పేర్కొన్నారు. కొలిమిగుండ్ల మండలంలోని కనకాద్రిపల్లి, రామ్మోహన్ చెరువు, తిమ్మనాయునిపేట చెరువుల్లో పూడిక మట్టి తొలగించి రైతులకు అందించడం వల్ల వందల ఎకరాలు సాగులోకి వచ్చే అవకాశం ఉందన్నారు.

నీటి సంరక్షణలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేసిన కృషిని కొనియాడుతూ ఆయనను “భగీరథుడు”గా అభివర్ణించారు. ప్రస్తుతం నిధుల కొరత ఉన్నప్పటికీ పనులను ఆపకుండా ముందుకు తీసుకెళ్తున్నామని, కొంతమంది ప్రజాప్రతినిధులు స్వయంగా నిధులు సమకూర్చి మోటార్ల మరమ్మతులు చేయించిన విషయాన్ని గుర్తుచేశారు. పడమటిపల్లి ప్రాంతంలో ఎస్.ఆర్.బి.సి ద్వారా లిఫ్ట్ పనులు తక్కువ సమయంలో పూర్తి చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం నీటి కోసం 400–600 అడుగుల లోతు వరకు బోర్లు వేయాల్సి వస్తోందని, భూగర్భ జల మట్టం పెరిగితే మోటార్లపై ఒత్తిడి తగ్గి విద్యుత్ వినియోగం గణనీయంగా తగ్గుతుందని మంత్రి చెప్పారు. దీని ద్వారా ప్రభుత్వానికి భారీ స్థాయిలో ఆదా సాధ్యమవుతుందని వివరించారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని, ఫీల్డ్ మరియు టెక్నికల్ సిబ్బంది కాలువల పనులను ప్రత్యక్షంగా పరిశీలిస్తూ నాణ్యత ప్రమాణాలను పాటించాలని మంత్రి ఆదేశించారు. గ్రామాభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యం కీలకమని పేర్కొంటూ త్వరలో పెద్ద ఎత్తున శ్రమదాన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. కాలువల పనులకు రైతులు తమ ట్రాక్టర్లను అందించాలని కోరారు. భూగర్భ జలాల పెంపు కూడా అందరి బాధ్యతేనని ఉద్ఘాటించిన మంత్రి, వ్యవసాయం మరియు ఉద్యానవన అభివృద్ధి కోసం గ్రామాల వారీగా పంటల అనుకూలతపై సర్వేలు నిర్వహించి రైతులకు మార్గనిర్దేశం చేయాలని హార్టికల్చర్ అధికారులను సూచించారు. ఇరిగేషన్ మరియు ఉపాధి హామీ శాఖలు కలిసి చెరువులు, కుంటలను అభివృద్ధి చేసి నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచేలా ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు. కృషి చేస్తే భూగర్భ జలాలు పెరిగి వ్యవసాయం, తాగునీటి సమస్యలు తగ్గుతాయని ప్రజలకు భరోసా ఇచ్చారు.

జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి మాట్లాడుతూ, జిల్లాలో నీటి కొరత సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు సమగ్ర ప్రణాళికలు రూపొందించి వేగంగా అమలు చేస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం జిల్లాలో 40 గ్రామాలు తీవ్రమైన నీటి సమస్యను ఎదుర్కొంటుండగా, భూగర్భ జలాలు తీవ్రంగా తగ్గిన గ్రామాల సంఖ్య 165కి చేరిందన్నారు. ఈ గ్రామాల కోసం ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేసినట్లు చెప్పారు. జిల్లాలో 27 కాస్కేడ్ వ్యవస్థల అభివృద్ధికి చర్యలు చేపట్టామని, ఏప్రిల్ 6న ప్రారంభమైన పనులను వర్షాకాలానికి ముందే 100 రోజుల్లో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. ఎండల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని కార్మికులు ఉదయం, సాయంత్రం సమయాల్లో మాత్రమే పనులు నిర్వహించేలా సూచనలు ఇచ్చినట్లు పేర్కొన్నారు. బనగానపల్లె కాస్కేడ్ నంబర్–23కు ప్రాధాన్యత ఇచ్చినట్లు, ఇది సుమారు 13 చెరువులను అనుసంధానించి పశ్చిమ ప్రాంతానికి నీటి సరఫరా అందించే విధంగా అభివృద్ధి చెందుతోందని వివరించారు. ఐదు మండలాల్లో సుమారు 70 చెరువుల అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని, పర్కోలేషన్ ట్యాంకులు, చెక్ డ్యామ్‌లు, చెక్ వెల్స్, స్లూయిస్‌లు వంటి నిర్మాణాలు చేపడుతున్నామని తెలిపారు. కొండ ప్రాంతాల్లో ట్రెంచ్‌లు, రాక్ ఫిల్ డ్యామ్‌లు, లూజ్ బౌల్డర్ నిర్మాణాల ద్వారా వర్షపు నీటిని నిల్వ చేసే ప్రణాళికలు అమలు చేస్తున్నామని తెలిపారు. కాస్కేడ్ వ్యవస్థల్లో నీటి ప్రవాహం నిరంతరం కొనసాగేందుకు ఫీడర్ ఛానళ్లలో పూడికతీత, పిచ్చిమొక్కల తొలగింపు పనులు చేపడుతున్నామని చెప్పారు.

ప్రస్తుతం హనుమంతునిగుండం కాస్కేడ్‌ను నమూనాగా అభివృద్ధి చేసి, చేపట్టిన పనులను ముఖ్యమంత్రికి ప్రదర్శించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. జిల్లాలో భూగర్భ జల మట్టం సగటుగా 7.5 మీటర్ల లోతులో ఉండగా, కొలిమిగుండ్ల ప్రాంతంలో ఇది 16.5 మీటర్లకు పడిపోయిందని, అయితే గత ఏడాదితో పోలిస్తే కొంత మెరుగుదల నమోదైనట్లు పేర్కొన్నారు. భవిష్యత్తులో పోస్ట్ మాన్సూన్ సమయంలో 3 మీటర్ల లోపు, వేసవిలో 8 మీటర్ల లోపు భూగర్భ జల మట్టాన్ని నిలుపుదల చేయడం లక్ష్యమని తెలిపారు. కాస్కేడ్ పరిధిలోని పనులను వేగవంతం చేసేందుకు అవసరమైన యంత్రాలను వినియోగిస్తున్నామని చెప్పారు. వ్యవసాయాభివృద్ధికి అనుకూల పరిస్థితులను ఉపయోగించుకుని పంట మార్పిడి, హార్టికల్చర్ అభివృద్ధి ద్వారా రైతుల ఆదాయం పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అభివృద్ధి పనుల స్థిరత్వం కోసం వాటర్ యూజర్ అసోసియేషన్ల ద్వారా నిర్వహణ బాధ్యతలు చేపట్టాలని సూచించారు. “నీరే నిజమైన సంపద. భవిష్యత్తు తరాలకు నీటి భద్రత కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం” అని కలెక్టర్ స్పష్టం చేశారు.

Scroll to Top