స్వచ్ఛ సర్వేక్షణలో ఆరు మున్సిపాలిటీలు మెరుగైన ర్యాంకులు సాధించాలి

పది కీలక పారామీటర్లలో ఉత్తమ పనితీరు కనబర్చాలి

సర్కులర్ ఎకానమీ – పిఎం సూర్య ఘర్‌పై విస్తృత అవగాహన కల్పించాలి

సత్యం వార్త / నంద్యాల జిల్లా బ్యూరో /జనవరి 6 :
జిల్లాలోని ఆరు మున్సిపాలిటీల్లో పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని కల్పించి ప్రజలు స్వచ్ఛమైన గాలి పీల్చుతూ ఆహ్లాదకర జీవనం గడిపేలా మున్సిపల్ అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి మున్సిపల్ కమీషనర్లను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో స్వచ్ఛ సర్వేక్షణ–2025లో భాగంగా నిర్దేశించిన 10 కీలక పారామీటర్లపై మున్సిపల్ కమిషనర్లతో జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, స్వచ్ఛ సర్వేక్షణలో జిల్లాలోని ఆరు మున్సిపాలిటీలు మెరుగైన ర్యాంకులు సాధించేలా లక్ష్యంగా పెట్టుకొని ప్రణాళికాబద్ధంగా పనిచేయాలని సూచించారు. ముఖ్యంగా క్రింది పది పారామీటర్లలో ప్రతి మున్సిపాలిటీ ఉత్తమ పనితీరు కనబర్చాలని ఆదేశించారు.
●కనిపించే పరిశుభ్రత (Visible Cleanliness) – రహదారులు, మార్కెట్లు, బస్టాండ్‌లు, ప్రభుత్వ కార్యాలయాలు పరిశుభ్రంగా కనిపించేలా రోజువారీ పారిశుధ్య చర్యలు చేపట్టాలి.
●వ్యర్థాల విభజన, సేకరణ & రవాణా – ఇంటింటి నుంచి తడి–పొడి చెత్తను వేరు చేసి సేకరించి శాస్త్రీయంగా రవాణా చేయాలి.
●సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ – చెత్త ప్రాసెసింగ్ యూనిట్ల సమర్థ నిర్వహణ ద్వారా డంపింగ్ యార్డుల సమస్యను తగ్గించాలి.
●పారిశుధ్యానికి ప్రాప్యత – ప్రతి కుటుంబానికి మరుగుదొడ్ల సదుపాయం ఉండేలా చర్యలు తీసుకోవాలి.
●వాడిన నీటి నిర్వహణ – గ్రే వాటర్ నిర్వహణ ద్వారా మురుగు నీరు రోడ్లపై నిల్వ కాకుండా చూడాలి.
●డీస్లడ్జింగ్ సేవల యాంత్రీకరణ – సెప్టిక్ ట్యాంకుల శుభ్రతను యాంత్రీకృత పద్ధతుల్లో నిర్వహించాలి.
●స్వచ్ఛత కోసం వకాలత్వం (Advocacy) – ప్రజల్లో పరిశుభ్రతపై అవగాహన కల్పించే కార్యక్రమాలు విస్తృతంగా నిర్వహించాలి.
●పర్యావరణ వ్యవస్థ బలోపేతం & సంస్థాగత ప్రమాణాలు – మున్సిపల్ వ్యవస్థను మరింత బలోపేతం చేయాలి.

●పారిశుధ్య కార్మికుల సంపూర్ణ సంక్షేమం – కార్మికుల భద్రత, ఆరోగ్యం, సంక్షేమానికి ప్రాధాన్యం ఇవ్వాలి.
●పౌరుల అభిప్రాయం & ఫిర్యాదుల పరిష్కారం – స్వచ్ఛ సర్వేక్షణ, అన్నా క్యాంటీన్, మున్సిపల్ సేవలపై ప్రజా అభిప్రాయాన్ని సేకరించి వేగంగా సమస్యలు పరిష్కరించాలి.
స్వచ్ఛ సర్వేక్షణ ర్యాంకింగ్లో ప్రజాభిప్రాయానికి కీలక ప్రాధాన్యం ఉన్నందున, ప్రజలకు మెరుగైన మున్సిపల్ సేవలు అందించేలా అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేయాలని కలెక్టర్ ఆదేశించారు. వచ్చే వేసవిని దృష్టిలో ఉంచుకొని త్రాగునీటి కొరత తలెత్తకుండా ఇప్పటి నుంచే ముందస్తు ప్రణాళికతో త్రాగునీటి వసతులు కల్పించాలన్నారు. తాము చేస్తున్న పనులు అధిక సంఖ్యలో ప్రజలకు ఉపయోగపడేలా ఉండాలని కలెక్టర్ సూచించారు. అలాగే సర్కులర్ ఎకానమీ దిశగా పిఎం సూర్య ఘర్ పథకంపై ప్రత్యేక ఫోకస్ పెట్టి, సౌరశక్తి వినియోగంపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని మున్సిపల్ కమిషనర్లకు సూచించారు. నిర్దేశించిన ప్రమాణాల మేరకు స్వచ్ఛ కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేసి, స్వచ్ఛ సర్వేక్షణ ర్యాంకింగ్లో జిల్లా ముందంజలో నిలిపేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు.

అదేవిధంగా మెప్మా కార్యక్రమాల ద్వారా మహిళలకు జీవనోపాధి అవకాశాలు పెంచాలని, ఈ రంగంలో జిల్లా ప్రస్తుతం రెండో స్థానంలో ఉన్న నేపథ్యంలో మరింత మెరుగైన ఫలితాలు సాధించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సమావేశంలో నంద్యాల, డోన్, నందికొట్కూరు, బేతంచెర్ల, ఆళ్లగడ్డ, ఆత్మకూరు మున్సిపల్ కమీషనర్లు శేషన్న, ప్రసాద్ గౌడ్, వెంకట్రామిరెడ్డి, హరిప్రసాద్, కిషోర్, రమేష్ బాబు లతో పాటు మెప్మా పిడి వెంకట దాసు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఈ కిషోర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top