భూగర్భ జలమట్టం పెంపుకు సమగ్ర చర్యలు తీసుకోండి

వాగులు, చెరువుల పునరుద్ధరణతో జలసంరక్షణకు ప్రాధాన్యం

జలధార-జలహారతి పనులను వేగవంతం చేయండి

ఆక్రమణలపై కఠిన చర్యలు తీసుకోవాలి

జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా

సత్యం వార్త / నంద్యాల జిల్లా బ్యూరో / ఏప్రిల్ 07  :

జిల్లాలో భూగర్భ జలమట్టాన్ని గణనీయంగా పెంచేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో కృషి చేయాలని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి మండల స్థాయి అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో “జలధార – జలహారతి” కార్యక్రమంపై మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి, పనుల పురోగతిని సమీక్షించారు. ఈ సమావేశంలో జిల్లా భూగర్భ శాఖ అధికారి రఘురాం, జలవనరుల శాఖ అధికారి శివ శంకర్, డ్వామా పీడీ సూర్యనారాయణ మూర్తి, తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో మేజర్ ఇరిగేషన్ పరిధిలో 215.8 టీఎంసీలు, మీడియం ఇరిగేషన్ కింద 37.59 టీఎంసీలు, మైనర్ ఇరిగేషన్ కింద 330 చెరువుల ద్వారా 5.5 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం ఉన్నట్లు తెలిపారు. ఈ జలవనరులన్నింటినీ క్షేత్రస్థాయిలో సమగ్రంగా పరిశీలించి, యథావిధిగా పునరుద్ధరించడం ద్వారా భూగర్భ జలాల స్థాయి క్రమంగా పెరుగుతోందని వెల్లడించారు. ట్యాంకులను అనుసంధానం చేయడం ద్వారా జలపాత వ్యవస్థ (కాస్కేడ్) మరింత బలోపేతం అవుతుందని, బేసిన్ కనెక్టివిటీ ద్వారా జలమట్టం గణనీయంగా పెరిగే అవకాశం ఉందన్నారు. వాగులకు నీరు సరఫరా చేసే మార్గాల్లో అడ్డంకిగా ఉన్న చెట్లను పూర్తిగా తొలగించాలని, లేకపోతే నీటి నిల్వ సాధ్యం కాదని స్పష్టం చేశారు. ఇందుకు అవసరమైన పనులను ఉపాధి హామీ పథకం ద్వారా వేగవంతంగా పూర్తి చేయాలని సూచించారు. ఉపాధి హామీ పనులను శాతం వంద పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు.

అలాగే వాగులు, చెరువులపై ఉన్న ఆక్రమణలను వెంటనే గుర్తించి తొలగించేందుకు తహశీల్దార్లు తక్షణ చర్యలు చేపట్టాలని తెలిపారు. ఈ పనుల అమలులో కార్మికులను సమృద్ధిగా వినియోగించాలని సూచించారు. ఈ కార్యక్రమాల ద్వారా చేపల పెంపకాన్ని అభివృద్ధి చేయడంతో పాటు బంజరు భూములను సాగులోకి తీసుకురావచ్చని, పశుగ్రాసం పెంపు మరియు చెరువుల పరిసర ప్రాంతాల్లో పచ్చదనం పెంపునకు ఇది దోహదపడుతుందని కలెక్టర్ వివరించారు. అదనంగా, విద్యుత్ వినియోగాన్ని తగ్గించే చర్యలపై కూడా దృష్టి సారించాలని అధికారులకు సూచించారు.

Scroll to Top