

సత్యం వార్త / నంద్యాల జిల్లా బ్యూరో / ఏప్రిల్ 02 :
నంద్యాల పట్టణంలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో అందిస్తున్న వైద్య సేవలను జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలోని అత్యవసర విభాగంతో పాటు ఇన్‌పేషెంట్, ఔట్‌పేషెంట్ (ఓపీ), రిజిస్ట్రేషన్ బ్లాక్, మెడికల్ ఎమర్జెన్సీ వార్డులను పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులతో కలెక్టర్ నేరుగా మాట్లాడి, వారికి అందుతున్న వైద్య సేవలపై వివరాలు తెలుసుకున్నారు. రోగులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నాణ్యమైన వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత వైద్యులు, సిబ్బందిని ఆదేశించారు. ఆసుపత్రిలో శుభ్రత, సమయపాలన, సేవల నాణ్యత విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం ఉండకూడదని కలెక్టర్ స్పష్టం చేసారు. ప్రజలకు మెరుగైన వైద్య సౌకర్యాలు అందించడం ప్రతి వైద్యుడి బాధ్యత అని సూచించారు. అలాగే, రోగుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని సేవలను మరింత మెరుగుపరచాలని, అత్యవసర సేవలు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండేలా చూడాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు.
