
సత్యం వార్త / నంద్యాల జిల్లా బ్యూరో / మార్చి 31 :
జిల్లాలో భూసంబంధిత సమస్యలను నాణ్యతతో, పారదర్శకంగా పరిష్కరించి ప్రజల సంతృప్తి స్థాయిని పెంపొందించేలా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం అమరావతిలోని భూపరిపాలన ప్రధాన కార్యాలయం నుంచి భూపరిపాలన ప్రధాన కార్యదర్శి జయలక్ష్మి రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా భూసంబంధిత అంశాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో నంద్యాల జిల్లా నుంచి ఎన్ఐసీ వీడియో కాన్ఫరెన్స్ హాలులో జాయింట్ కలెక్టర్ కొల్లాబత్తుల కార్తీక్, సర్వే ఏడీ శ్రీరాం మోహన్ తదితర అధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం భూసమస్యల సమగ్ర పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తూ పలు చర్యలు తీసుకుంటోందన్నారు. ఇప్పటికే పరిష్కరించిన భూసంబంధిత అర్జీలపై లబ్ధిదారుల నుంచి అభిప్రాయాలను సేకరించి, వారి సంతృప్తి స్థాయిని అంచనా వేయాలని సూచించారు. ఎక్కడైనా అసంతృప్తి వ్యక్తమైతే, వాటిని మరింత సమర్థవంతంగా పరిష్కరించే విధంగా ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ప్రతి సోమవారం కలెక్టరేట్లో నిర్వహిస్తున్న ‘రెవెన్యూ క్లినిక్స్’ ద్వారా ప్రజల నుంచి వచ్చే భూ సంబంధిత ఫిర్యాదులను సమగ్రంగా పరిశీలించి, త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమాన్ని మరింత సమర్థవంతంగా నిర్వహించి, ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా సేవలను మెరుగుపరచాలని సూచించారు. అంతకుముందు భూపరిపాలన ప్రధాన కార్యదర్శి జయలక్ష్మి మాట్లాడుతూ, ఐవిఆర్ఎస్ ద్వారా పొందుతున్న ప్రజా స్పందనపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని, వచ్చిన అభిప్రాయాలను విశ్లేషించి సేవల నాణ్యతను పెంపొందించేందుకు కృషి చేయాలని సూచించారు.
