12 పరిశ్రమల యూనిట్లకు ఆర్థిక ప్రోత్సాహం
జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా


సత్యం వార్త / నంద్యాల జిల్లా బ్యూరో / మార్చి 31 :
ఉత్పాదన, సేవా రంగాల్లో 12 యూనిట్లకు ఆర్థిక ప్రోత్సాహం అందిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి అన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో జిల్లా పరిశ్రమలు మరియు ఎగుమతి ప్రోత్సాహక కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా పరిశ్రమల మేనేజర్ ఎస్. మహబూబ్ బాషా, డి ఆర్ డి ఏ పి డి శ్రీధర్ రెడ్డి, డిప్యూటీ చీఫ్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ నారాయణరెడ్డి, ఎల్‌డీఎం రవీంద్ర కుమార్, జిల్లా ఉద్యాన శాఖ అధికారి నాగరాజు తదితర అధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో పరిశ్రమల స్థాపనకు సంబంధించి ఇప్పటివరకు మొత్తం 868 దరఖాస్తులు అందగా, సింగిల్ డెస్క్ విధానం ద్వారా 846 పరిశ్రమలకు అనుమతులు మంజూరు చేసినట్లు తెలిపారు. పెండింగ్‌లో ఉన్న 22 దరఖాస్తులను సంబంధిత శాఖలు పరస్పర సమన్వయంతో త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. చిన్న, మధ్య తరహా పరిశ్రమల ప్రోత్సాహంలో భాగంగా ప్రభుత్వ పథకాల ద్వారా పెట్టుబడి రాయితీలు, పావలా వడ్డీ, విద్యుత్ చార్జీలపై సబ్సిడీలు, సేల్స్ ట్యాక్స్ రాయితీలు వంటి ప్రయోజనాల కింద ఉత్పాదన మరియు సేవా రంగాలకు చెందిన 12 పరిశ్రమల యూనిట్లకు మొత్తం రూ.97.08 లక్షల రాయితీలను కమిటీ ఆమోదించినట్లు తెలిపారు.
జిల్లాలో నూతనంగా ఆమోదం పొందిన 19 ప్రాజెక్టుల పురోగతిపై సమగ్ర అవగాహన కలిగి, భూసంబంధిత సమస్యలు, నీటి వనరులకు సంబంధించిన అడ్డంకులు వంటి అంశాలను విశ్లేషించి, తగిన పరిష్కార చర్యలు చేపట్టాలని కలెక్టర్ సూచించారు. NEDCAP తో సమన్వయం చేసుకుంటూ ప్రతి ప్రాజెక్టులో ఎదురవుతున్న సమస్యలను నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. ఎల్‌పీజీ గ్యాస్ సరఫరాకు సంబంధించి ఎలాంటి ఇబ్బందులు తలెత్తినా వెంటనే జాయింట్ కలెక్టర్‌కు సమాచారం చేరే విధంగా చర్యలు తీసుకోవాలని పరిశ్రమల మేనేజర్‌కు సూచించారు. జిల్లాలోని 44 విభాగాల్లో 12 విభాగాల పనితీరు నిరుత్సాహకరంగా ఉన్న నేపథ్యంలో, వాటి పనితీరును మెరుగుపర్చేందుకు ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు.
