కలెక్టర్ నిధులతో ఆర్‌ఓ వాటర్ ప్లాంట్ ప్రారంభం

జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా

సత్యం వార్త / నంద్యాల జిల్లా బ్యూరో / మార్చి 24 :

లారీ డ్రైవర్లకు శుద్ధమైన తాగునీరు అందుబాటులో ఉండేలా జిల్లా పరిపాలన ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి తెలిపారు. లారీ ఓనర్స్ అసోసియేషన్ సభ్యుల విజ్ఞప్తి మేరకు, నంద్యాల పట్టణంలోని విజయ పాల డైరీ సమీపంలో రూ. 2.40 లక్షల వ్యయంతో, గంటకు 1000 లీటర్ల (ఎల్.పి.హెచ్) సామర్థ్యం గల ఆధునిక ఆర్‌ఓ వాటర్ ప్లాంట్‌ను ఏర్పాటు చేసి మంగళవారం కలెక్టర్ ప్రారంభించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, గత జనవరి 31న లారీ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన 37వ జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవం ముగింపు కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు డ్రైవర్లు శుద్ధమైన తాగునీటి అవసరాన్ని తన దృష్టికి తీసుకువచ్చారని గుర్తుచేశారు. వారి అవసరాన్ని ప్రాధాన్యంగా తీసుకుని తక్షణమే ఆర్‌ఓ ప్లాంట్ మంజూరు చేసి, నిర్ణీత గడువులో పూర్తి చేయించడం జరిగిందన్నారు. ఈ ఆర్‌ఓ ప్లాంట్ ద్వారా లారీ, ఆటో డ్రైవర్లకు మాత్రమే కాకుండా సమీప ప్రాంత ప్రజలకు కూడా శుద్ధమైన తాగునీరు అందుబాటులోకి వస్తుందని కలెక్టర్ తెలిపారు. స్వచ్ఛమైన నీటి వినియోగం వల్ల నీటి ద్వారా వ్యాపించే వ్యాధులను గణనీయంగా తగ్గించవచ్చని, ప్రజల ఆరోగ్య రక్షణలో ఈ ప్లాంట్ కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. ప్లాంట్‌లో అధునాతన ఫిల్ట్రేషన్ సాంకేతికత, సమృద్ధిగా నిల్వ ట్యాంకులు, సురక్షిత పంపిణీ వ్యవస్థలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పనులను వేగవంతంగా పూర్తి చేసి అందుబాటులోకి తీసుకువచ్చిన ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులను కలెక్టర్ అభినందించారు. భవిష్యత్తులో కూడా ప్లాంట్ నిర్వహణలో నాణ్యత ప్రమాణాలు కచ్చితంగా పాటించేలా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

ఆర్‌ఓ ప్లాంట్ ప్రారంభంతో లారీ మరియు ఆటో డ్రైవర్లు హర్షం వ్యక్తం చేశారు. తమ విజ్ఞప్తిని గౌరవించి తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిన జిల్లా కలెక్టర్‌కు వారు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్ఈ శ్రీనివాసులు, లారీ ఓనర్స్ అసోసియేషన్ సభ్యులు, డ్రైవర్లు తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top