జాతీయ మహిళా కమిషన్ అధ్యక్షురాలు విజయ రహత్కర్
జిల్లాలో సమస్యలపై కట్టుదిట్టమైన చర్యలు
గత ఏడాదితో పోలిస్తే కేసులు తగ్గినట్లు వెల్లడి
- జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి గణియా




సత్యం వార్త / నంద్యాల జిల్లా బ్యూరో / మార్చి 18 :
మహిళా సాధికారతతో సమాజ అభివృద్ధి సాధ్యమని జాతీయ మహిళా కమిషన్ అధ్యక్షురాలు విజయ రహత్కర్ అన్నారు. బుధవారం శ్రీశైలంలోని దేవస్థాన కార్యనిర్వహణాధికారి కార్యాలయం లోని మీటింగ్ హాల్ నందు జిల్లా స్థాయి సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి, జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్ సంబంధిత జిల్లా అధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జాతీయ మహిళా కమిషన్ అధ్యక్షురాలు మాట్లాడుతూ, డా. బి.ఆర్. అంబేద్కర్ చెప్పిన “సమాజ పురోగతిని మహిళల అభివృద్ధితోనే అంచనా వేయాలి” అనే సూక్తిని ప్రస్తావిస్తూ, మహిళా సాధికారతే సమాజ అభివృద్ధికి పునాదిగా నిలుస్తుందని పేర్కొన్నారు.
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా 550 జిల్లాల్లో ‘మహిళా జనసునావి’ కార్యక్రమాలను నిర్వహించినట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో ఐదు జిల్లాల్లో విజయవంతంగా నిర్వహించిన ఈ కార్యక్రమాల ద్వారా గృహ హింస, బలవంతపు శ్రమ, వృద్ధ మహిళలపై దౌర్జన్యాల వంటి అంశాలపై నేరుగా ఫిర్యాదులను స్వీకరించి పరిష్కార చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా 2022 ఏప్రిల్ 4న ఏర్పడిన నంద్యాల జిల్లా పరిపాలన, ఆర్థిక మరియు సామాజిక రంగాల్లో వేగంగా అభివృద్ధి చెందుతోందని తెలిపారు. 2025 ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు 20.27 కోట్లకు పైగా డిజిటల్ లావాదేవీలు నమోదై, వాటి విలువ రు.1.09 లక్షల కోట్లకు చేరినట్లు తెలిపారు. వ్యవసాయ రంగంలో డిఎపి ఎరువుల వినియోగంలో దేశంలో అగ్రస్థానంలో నిలవడం విశేషమని పేర్కొన్నారు. ఈ విజయాల్లో మహిళల పాత్ర కీలకమని కొనియాడారు.
శ్రీశైలం ప్రాధాన్యత:
శ్రీశైలం దేవస్థానం వద్ద ఉగాది సందర్భంగా లక్షలాది మంది భక్తులు తరలివస్తారని, ముఖ్యంగా మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొనడం వారి ఆత్మవిశ్వాసానికి నిదర్శనమని తెలిపారు. శక్తిపీఠం మరియు జ్యోతిర్లింగం ఒకేచోట ఉండటం “శివ-శక్తి ఏకరూపం”కు ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు.
జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి మాట్లాడుతూ జిల్లా పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఉమ్మడి కర్నూలు జిల్లా నుండి విడిపోయి నంద్యాల జిల్లా ఏర్పడిందని కలెక్టర్ వివరించారు. ఈ జిల్లాలో ఒక పార్లమెంటరీ నియోజకవర్గం, ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నట్లు తెలిపారు. భౌగోళికంగా ప్రాధాన్యం కలిగిన శ్రీశైలం క్షేత్రం నల్లమల అరణ్యాల మధ్య, కృష్ణా నది తీరాన విరాజిల్లుతూ ఆధ్యాత్మిక కేంద్రంగా ప్రసిద్ధి చెందిందని చెప్పారు. అక్టోబర్ 16న భారత ప్రధాని నరేంద్ర మోదీ శ్రీశైలాన్ని సందర్శించడం ద్వారా ఈ ప్రాంతానికి భక్తులు, పర్యాటకుల రాక గణనీయంగా పెరిగిందని పేర్కొన్నారు.
మహిళా, శిశు సంక్షేమంపై ప్రత్యేక దృష్టి
జిల్లాలో మహిళా, శిశు సంక్షేమ కార్యక్రమాల అమలుపై NCW ప్రతినిధి శైలజ సమీక్ష నిర్వహించినట్లు కలెక్టర్ తెలిపారు. బాల్య వివాహాల నిర్మూలనలో జిల్లా యంత్రాంగం సమర్థవంతంగా పనిచేస్తోందని, ఈ కృషిని శైలజ అభినందించినట్లు చెప్పారు. కౌమార దశలో ఉన్న బాలికల ఆరోగ్యం, సాధికారత కోసం “కిషోరీ బాలిక వికాసం” కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్లు వివరించారు. అలాగే, జిల్లాలో 1663 అంగన్వాడీ కేంద్రాలు కార్యకలాపాలు నిర్వహిస్తూ గర్భిణీలు, బాలింతలు, చిన్నారులకు పోషకాహారం అందిస్తున్నాయని తెలిపారు. పిల్లల్లో స్టంటింగ్, వేస్టింగ్ సమస్యలను తగ్గించే దిశగా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ వివరించారు.
మహిళల రక్షణకు మౌలిక వసతులు
జిల్లా కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం మహిళల భద్రత, సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని పలు కీలక విభాగాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అనాథ, నిరాశ్రయ పిల్లల కోసం శిశు గృహం ఏర్పాటు చేసామన్నారు. బాలల రక్షణ కోసం డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ సమర్థవంతంగా పనిచేస్తోందని పేర్కొన్నారు. ఆపదలో ఉన్న మహిళలకు తక్షణ సహాయం అందించేందుకు వన్ స్టాప్ సెంటర్ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇక, ఉద్యోగినుల కోసం జిల్లాకు రెండు వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్స్ మంజూరయ్యాయని, ప్రస్తుతం అద్దె భవనాల్లో కార్యకలాపాలు ప్రారంభించి, త్వరలో శాశ్వత భవనాల నిర్మాణం చేపట్టనున్నట్లు కలెక్టర్ వెల్లడించారు.
గ్రామ స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు అవగాహన కార్యక్రమాలు విస్తృతంగా నిర్వహించామని అధికారిణి తెలిపారు. గత ఏడాదితో పోలిస్తే కేసుల సంఖ్య 722 నుండి 500కు తగ్గి గణనీయమైన తగ్గుదల నమోదైందని చెప్పారు. జూన్ 24 తర్వాత వివాహాలు అధికంగా జరిగే అవకాశముండటంతో, అన్ని ప్రభుత్వ శాఖలతో సమన్వయం చేసుకుని మరింత కఠినంగా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. కేవలం కౌన్సెలింగ్ ద్వారా ఆశించిన ఫలితాలు రావడం లేదని, అందువల్ల ఎఫ్ఐఆర్ నమోదు చేయడం వంటి కఠిన చర్యలు కూడా అమలు చేస్తున్నామని కలెక్టర్ వివరించారు.
జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్ మాట్లాడుతూ జిల్లా ఏర్పాటైనప్పటి నుండి మహిళా భద్రతపై ప్రత్యేక దృష్టి సారిస్తూ పలు సమర్థవంతమైన చర్యలు తీసుకుంటున్నామన్నారు జిల్లాలోని మొత్తం 40 పోలీస్ స్టేషన్లలో ప్రత్యేక మహిళా హెల్ప్ డెస్క్లు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అలాగే ప్రతి సోమవారం ప్రత్యేక పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెస్సల్ సిస్టమ్ నిర్వహిస్తూ మహిళల సమస్యలను వేగంగా పరిష్కరించే చర్యలు చేపడుతున్నట్లు వివరించారు. మహిళల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వుమెన్ పోలీస్ స్టేషన్లో ఇద్దరు సీఐలు, ఇద్దరు ఎస్సైలు మరియు 20 మంది సిబ్బంది సేవలందిస్తున్నట్లు ఎస్ప్ఇటీవల సంవత్సరాల్లో మహిళలపై జరిగే నేరాల నియంత్రణలో గణనీయమైన పురోగతి కనిపిస్తోందన్నారు. 2024తో పోలిస్తే 2025లో మహిళలపై నేరాలు సుమారు 10 శాతం తగ్గగా, ముఖ్యంగా అత్యాచార కేసులు 60 శాతం వరకు తగ్గాయన్నారు. జిల్లాలో శక్తి బృందాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని వివరించారు. మొత్తం ఆరు బృందాలు పాఠశాలలు, కళాశాలలు, హాస్టళ్లలో పర్యటిస్తూ మహిళా రక్షణపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అదనంగా, నేరాలు జరిగే అవకాశమున్న హాట్స్పాట్ ప్రాంతాల్లో నిరంతర పెట్రోలింగ్ నిర్వహిస్తూ అప్రమత్తత పెంచుతున్నామన్నారు.
