


సత్యం వార్త / నంద్యాల జిల్లా బ్యూరో / మార్చి 16 :
నాబార్డ్ ఆర్థిక సహాయంతో అవార్డు స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్వయం సహాయక సంఘాల ఉత్పత్తుల మేళాను నంద్యాల పట్టణంలోని జె.కే ఫంక్షన్ హాల్లో సోమవారం ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నాబార్డ్ నంద్యాల జిల్లా అసిస్టెంట్ జనరల్ మేనేజర్ కార్తీక్, డీఆర్డీఏ ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీధర్ రెడ్డి, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీజినల్ హెడ్ నరసింహారావు తదితరులు పాల్గొని మేళాను ప్రారంభించారు.
ఈ సందర్భంగా డీఆర్డీఏ ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ మహిళలు తమ ఉత్పత్తులను తయారు చేయడమే కాకుండా మార్కెటింగ్ అవకాశాలను కూడా వినియోగించుకోవాలని సూచించారు. ఉత్పత్తుల బ్రాండింగ్, ప్యాకేజింగ్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటే మంచి ఆదాయం సాధించవచ్చని తెలిపారు. నాబార్డ్ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ కార్తీక్ మాట్లాడుతూ ఇలాంటి మేళాల ద్వారా రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో తయారయ్యే ఉత్పత్తులను తెలుసుకునే అవకాశం కలుగుతుందని పేర్కొన్నారు. మహిళలు ఒకరితో ఒకరు అనుభవాలు పంచుకోవడం ద్వారా కొత్త విషయాలు నేర్చుకుని తమ వ్యాపారాలను మరింత అభివృద్ధి చేసుకునే అవకాశం ఉంటుందని తెలిపారు. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీజినల్ హెడ్ నరసింహారావు మాట్లాడుతూ వినియోగదారుడు మరియు ఉత్పత్తిదారుడు మధ్య నేరుగా అనుసంధానం కల్పించాలనే ఉద్దేశంతో ఈ మేళాను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఉత్పత్తిదారులచే నేరుగా అమ్మకాలు నిర్వహిస్తున్నందున నంద్యాల పట్టణం మరియు పరిసర ప్రాంత ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఈ మేళాలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు, పల్నాడు, ప్రకాశం, నంద్యాల, కడప, అనంతపురం జిల్లాలకు చెందిన మహిళలు పాల్గొనగా, తెలంగాణ రాష్ట్రానికి చెందిన కొన్ని స్వయం సహాయక సంఘాలు కూడా తమ ఉత్పత్తులను ప్రదర్శించాయి. మేళాలో మంగళగిరి చీరలు, చీరాల చేనేత వస్త్రాలు, పొందూరు ఖద్దరు, వన్‌గ్రామ్ గోల్డ్ ఆభరణాలు, జూట్ బ్యాగులు, ఆర్గానిక్ ఉత్పత్తులు, పోచంపల్లి చీరలు, వెంకటగిరి చీరలు, ధర్మవరం చీరలు, చెక్కతో తయారు చేసిన బొమ్మలు తదితర ఉత్పత్తులను ప్రదర్శనకు మరియు అమ్మకానికి ఉంచారు. నంద్యాల ప్రాంత ప్రజలు ఈ మేళాను సందర్శించి స్వయం సహాయక సంఘాల మహిళలకు ప్రోత్సాహం అందించడంతో పాటు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు.
