జిల్లా వ్యాప్తంగా పెంటా, ఐపివి, రోటా టీకాల కొరత– తల్లిదండ్రులతో మాట పడుతున్నామని సచివాలయ హెల్త్ సెక్రటరీల ఆవేదన

సత్యం వార్త / నంద్యాల జిల్లా ప్రతినిధి / మార్చి 05:
జిల్లాలో పుట్టిన చిన్నారులకు తప్పనిసరిగా ఇవ్వాల్సిన మూడు ముఖ్యమైన టీకాలు అందుబాటులో లేకపోవడంతో తల్లిదండ్రుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. చిన్నారుల ఆరోగ్య రక్షణలో కీలకమైన పెంటా-1, ఐపివి-1, రోటా-1 టీకాలు గత రెండు నెలలుగా జిల్లా వ్యాప్తంగా లభించకపోవడం పై ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సాధారణంగా పుట్టిన 45 రోజుల తర్వాత చిన్నారులకు ఈ మూడు టీకాలను పంచటీకా కార్యక్రమంలో భాగంగా ఇవ్వాల్సి ఉంటుంది. అయితే ప్రస్తుతం జిల్లాలోని జిల్లా కేంద్రం నుంచి మండల స్థాయి ఆరోగ్య కేంద్రాలు, గ్రామ సచివాలయాల వరకు ఈ టీకాల స్టాక్ లేకపోవడంతో తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
గ్రామ సచివాలయాలలో పనిచేస్తున్న హెల్త్ సెక్రటరీలు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. టీకాలు లేకపోవడంతో చిన్నారుల తల్లిదండ్రులు ప్రశ్నించగా వారికి సమాధానం చెప్పలేని పరిస్థితి ఏర్పడుతోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ నుంచి సరైన సరఫరా లేకపోవడం వల్లే తల్లిదండ్రులతో తరచూ మాట పడాల్సి వస్తోందని హెల్త్ సెక్రటరీలు చెబుతున్నట్లు సమాచారం.
పుట్టిన చిన్నారులకు సమయానికి టీకాలు ఇవ్వకపోతే తీవ్రమైన ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయినప్పటికీ రెండు నెలలుగా టీకాల కొరత కొనసాగడం వైద్యశాఖ పనితీరుపై ప్రశ్నలు లేవనెత్తుతోంది.
చిన్నారుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని వెంటనే పెంటా-1, ఐపివి-1, రోటా-1 టీకాలను జిల్లాకు సరఫరా చేసి అందుబాటులోకి తీసుకురావాలని తల్లిదండ్రులు, ప్రజలు జిల్లా వైద్యాధికారులను కోరుతున్నారు.
