మెప్మా కార్యాలయంలో మహిళలకు మరుగుదొడ్ల సమస్య

సత్యం వార్త / నంద్యాల జిల్లా ప్రతినిధి / ఫిబ్రవరి 27:
నంద్యాల పట్టణంలోని మున్సిపల్ కార్యాలయ ప్రాంగణంలో ఉన్న మెప్మా పీడీ కార్యాలయం వద్ద మహిళల కోసం ఏర్పాటు చేసిన మరుగుదొడ్డి నిరుపయోగంగా మారింది. నెలలుగా టాయిలెట్ పనిచేయకపోవడంతో ప్రతిరోజూ కార్యాలయానికి వచ్చే వందలాది మహిళలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
మెప్మా కార్యాలయానికి స్వయం సహాయక సంఘాల మహిళలు, పట్టణ పేద కుటుంబాల ప్రతినిధులు, రుణాలు మరియు ప్రభుత్వ పథకాల కోసం వచ్చే లబ్ధిదారులు రోజూ భారీగా హాజరవుతుంటారు. అయితే మహిళల అవసరాలకు సరిపడా సౌకర్యాలు లేకపోవడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది.
ప్రస్తుతం ఉన్న టాయిలెట్ శుభ్రత లేకపోవడం, నీటి సరఫరా నిలిచిపోవడం, మరమ్మతులు చేయకపోవడం వల్ల పూర్తిగా ఉపయోగానికి అనర్హంగా మారింది. దీంతో మహిళలు కార్యాలయ పనుల నిమిత్తం గంటల పాటు ఉండాల్సి వస్తున్న సందర్భాల్లో తీవ్రమైన అసౌకర్యం ఎదుర్కొంటున్నారు.
ప్రభుత్వ కార్యాలయంలోనే ప్రాథమిక వసతులు లేకపోవడం బాధాకరమని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే మరుగుదొడ్డిని మరమ్మతు చేసి, తాగునీటి సదుపాయం కల్పించి, శుభ్రత చర్యలు చేపట్టాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి మహిళల సమస్యను పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు.

Scroll to Top