ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో చలివేంద్రాలు – ట్రాఫిక్ కూడళ్లలో చలువ పందిళ్లు ఏర్పాటు చేయాలి
వంద శాతం ఇన్లైన్ క్లోరినేషన్ అమలు చేయాలి
జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా



సత్యం వార్త / నంద్యాల జిల్లా బ్యూరో / ఫిబ్రవరి 24 :
రానున్న రోజుల్లో ఎండ తీవ్రత పెరుగనున్న నేపథ్యంలో వేసవిలో నీటి ఎద్దడిని పకడ్బందీగా అధిగమించేలా అన్ని శాఖలు సమన్వయంతో ముందస్తు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో జిల్లా నీటి మరియు పరిశుభ్రత కమిటీ సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వేసవి కాలంలో త్రాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు ప్రణాళికతో పనిచేయాలని సూచించారు. ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో చలివేంద్రాలు ఏర్పాటు చేసి, వాటిలో నిరంతర త్రాగునీటి సరఫరా ఉండేలా చూడాలని ఆదేశించారు. ప్రజా రద్దీ అధికంగా ఉండే ప్రాంతాల్లో తాత్కాలిక త్రాగునీటి సదుపాయాలు కల్పించాలని మున్సిపల్, పంచాయతీ అధికారులకు సూచించారు. అలాగే ప్రధాన ట్రాఫిక్ కూడళ్లలో, సిగ్నల్ ప్రాంతాల్లో చలువ పందిళ్లు ఏర్పాటు చేసి ప్రజలకు ఉపశమనం కల్పించాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో త్రాగునీటి సరఫరాలో కేవలం బ్లీచింగ్కే పరిమితం కాకుండా, వంద శాతం ఇన్లైన్ క్లోరినేషన్ అమలు చేయాలని స్పష్టం చేశారు. ఇన్లైన్ క్లోరినేషన్ ద్వారా డయేరియా వంటి నీటిజన్య వ్యాధులను సమర్థవంతంగా నివారించవచ్చన్నారు.
నీటి ఎద్దడి ఉన్న ప్రాంతాలను ముందుగానే గుర్తించి, ఎక్కడా త్రాగునీటి కొరత లేకుండా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా ఆళ్లగడ్డ, చాగలమర్రి, సంజామల, ఆత్మకూరు మండలాల్లో చేతిపంపుల మరమ్మత్తుల కోసం పంపిన ప్రతిపాదనలను త్వరితగతిన ఆమోదించి పనులు పూర్తి చేయాలన్నారు. వేసవి కాలంలో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా అన్ని శాఖలు అప్రమత్తంగా వ్యవహరించి సమగ్ర సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ సూచించారు. ఈ సమావేశంలో ఆర్డబ్ల్యూఎస్, మున్సిపల్ సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
