భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా సమగ్ర ఏర్పాట్లు చేయాలి
జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి గణియా


సత్యం వార్త / నంద్యాల జిల్లా బ్యూరో / ఫిబ్రవరి 24 :
అహోబిలం శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాలను ఎటువంటి లోపాలు లేకుండా భక్తిశ్రద్ధలతో, పటిష్టంగా నిర్వహించేందుకు సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో బ్రహ్మోత్సవాల నిర్వహణపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో కలెక్టర్ సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సమావేశంలో అదనపు ఎస్పీ యుగంధర్ బాబు, నంద్యాల ఆర్డీఓ విశ్వనాథ్, ఆలయ పరిపాలనాధికారి రామానుజన్ మరియు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఫిబ్రవరి 21వ తేదీన ప్రారంభమైన అహోబిలం శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాలు మార్చి 4వ తేదీ వరకు నిర్వహించబడుతున్నాయని భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా ఎగువ మరియు దిగువ అహోబిలాల్లో జరిగే కళ్యాణోత్సవాల సందర్భంగా భక్తుల రద్దీ అధికంగా ఉండే అవకాశం ఉన్నందున ముందస్తు ప్రణాళికతో సమగ్ర చర్యలు చేపట్టాలని సూచించారు. భక్తుల సౌకర్యార్థం ఆలయ ప్రవేశ మార్గాల వెంట చలువ పందిళ్లు ఏర్పాటు చేయాలని, ఆలయ పరిసరాలను శుభ్రంగా, పచ్చదనంతో ఉంచేందుకు చర్యలు తీసుకోవాలని డీపీఓను ఆదేశించారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా తగిన వైద్య సిబ్బంది, అవసరమైన మందులు అందుబాటులో ఉంచాలని వైద్యశాఖ అధికారులకు సూచించారు. పార్కింగ్ సదుపాయాలు, తాత్కాలిక మరుగుదొడ్లు, పారిశుద్ధ్యం, త్రాగునీటి సరఫరా వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆర్డీఓను ఆదేశించారు.
ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకొని జలప్రసాదం కౌంటర్ల సంఖ్యను పెంచాలని సూచించారు. భక్తుల రవాణా సౌకర్యార్థం అవసరమైన సంఖ్యలో బస్సులు సిద్ధంగా ఉంచాలని, బ్రహ్మోత్సవాల సమయంలో టోల్ రుసుము మినహాయింపుపై చర్యలు తీసుకోవాలని తెలిపారు. ప్రముఖుల వేదిక, రథం తదితర ఏర్పాట్లను ఆర్ & బీ అధికారులు సమగ్రంగా పరిశీలించాలని ఆదేశించారు. విద్యుత్ తీగలు ఎక్కడా వేలాడకుండా భద్రతా ప్రమాణాలు పాటించాలని విద్యుత్ శాఖ అధికారులకు సూచించారు. దిగువ అహోబిలంలో లడ్డు కౌంటర్లను పెంచి భక్తుల రద్దీని తగ్గించాలని పేర్కొన్నారు. త్రాగునీరు మరియు ఇతర అవసరమైన వస్తువులు ఒకే ధరకు విక్రయించేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత తహశీల్దార్‌కు ఆదేశించారు. నీటి కుంటల వద్ద భద్రతా చర్యలుగా గజ ఈతగాళ్లను సిద్ధంగా ఉంచాలని, క్యూలైన్లలో ఉన్న భక్తులకు త్రాగునీరు, మజ్జిగ సరఫరా చేసేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ స్పష్టం చేశారు.
