అంతర్జాతీయ ఫిడే రేటింగ్ ఓపెన్ రాపిడ్ చెస్ టోర్నమెంట్ విజేతలకు బహుమతులు అందజేసిన డాక్టర్ రవి కృష్ణ, డాక్టర్ రామకృష్ణారెడ్డి

• మొదటి మూడు స్థానాలలో నిలిచిన ఆర్నవ్ అగర్వాల్, రామనాథ్ బాలసుబ్రమణ్యం, మణి భారతి

• రెండు రోజులపాటు జరిగిన టోర్నమెంట్ లో వివిధ రాష్ట్రాలు, తెలుగు రాష్ట్రాల జిల్లాల నుండి 300 మంది పైగా క్రీడాకారులు పాల్గొన్నారు.

• విజేతలకు 3 లక్ష రూపాయల నగదు బహుమతులు,ట్రోఫీలు, పతకాలు, ప్రశంసా పత్రాలు అందజేసారు.

సత్యం వార్త / నంద్యాల జిల్లా ప్రతినిధి / ఫిబ్రవరి 22 :
ఆంధ్ర చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నంద్యాల జిల్లా చెస్ సంఘం నిర్వహణలో శని, ఆది వారాలలో నంద్యాల రామకృష్ణ పీజీ కళాశాల ప్రాంగణంలో జరిగిన అంతర్జాతీయ ఫిడే రేటింగ్ ఓపెన్ రాపిడ్ చెస్ టోర్నమెంట్ ఘనంగా ముగిసింది.
ఈ సందర్భంగా నంద్యాల జిల్లా చెస్ సంఘం అధ్యక్షులు డాక్టర్ రవి కృష్ణ అధ్యక్షతన,నంద్యాల జిల్లా చెస్ సంఘం ప్రధాన కార్యదర్శి రామసుబ్బారెడ్డి నిర్వహణలో జరిగిన బహుమతి ప్రదానోత్సవం లో రామకృష్ణ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ రామకృష్ణారెడ్డి, నంద్యాల జిల్లా క్రీడాభారతి అధ్యక్ష కార్యదర్శులు శాంతినికేతన్ విద్యాసంస్థల సుధాకర్, నిమ్మకాయల సుధాకర్, నంద్యాల లయన్ క్లబ్ అధ్యక్షులు సోమేసుల నాగరాజు, కోశాధికారి అమిదేల జనార్ధన్ అతిథులుగా పాల్గొని వివిధ వయసు కేటగిరీలలో విజేతలకు 3 లక్ష రూపాయల నగదు బహుమతులు, ట్రోఫీలు, పతకాలు, ప్రశంసా పత్రాలు ప్రదానం చేశారు.
ప్రథమ స్థానంలో నిలిచిన ఉత్తరప్రదేశ్ కి చెందిన ఆర్నవ్ అగర్వాల్ 30 వేల రూపాయలు, ద్వితీయ స్థానంలో నిలిచిన తమిళనాడుకు చెందిన రామనాథ్ బాలసుబ్రమణ్యం 20వేల రూపాయలు,తృతీయ స్థానంలో నిలిచిన తమిళనాడుకు చెందిన మణి భారతి 15 వేల రూపాయల నగదు బహుమతులతో పాటు ట్రోఫీలు అందుకున్నారు.
ఈ సందర్భంగా డాక్టర్ రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ నంద్యాలలో అంతర్జాతీయ రేటింగ్ టోర్నమెంట్ నిర్వహించడం ప్రశంసనీయమన్నారు.విద్యార్థులను చదువుతోపాటు క్రీడలలో ప్రోత్సహించాలని విద్యాసంస్థలను, తల్లిదండ్రులను కోరారు.
డాక్టర్ రవి కృష్ణ మాట్లాడుతూ గెలిచినవారు నిరంతర సాధన ద్వారా భవిష్యత్తులో విజయాలు సాధించాలని, ఓటమి చెందిన వారు తమ పొరపాట్లను సరిదిద్దుకొని నిరంతర కృషిచేసి భవిష్యత్తులో విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.
నంద్యాల జిల్లా క్రీడాభారతి అధ్యక్షులు సుధాకర్ మాట్లాడుతూ చెస్ క్రీడ పట్ల బాలలలో ఆసక్తి పెరగడం అభినందనీయమన్నారు.
జిల్లా చెస్ సంఘం కార్యదర్శి రామ సుబ్బారెడ్డి మాట్లాడుతూ ఈ టోర్నమెంట్ లో వివిధ రాష్ట్రాలు, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో ఉన్న వివిధ జిల్లాల నుండి 300 మంది పైగా క్రీడాకారులు పాల్గొన్నారని తెలిపారు.
ఈ కార్యక్రమంలో కామినేని పల్లె సర్పంచ్ నరసింహారెడ్డి, తెలంగాణ రాష్ట్రానికి చెందిన అంతర్జాతీయ ఆర్బిటర్ చంద్రమౌళి,చీఫ్ ఆర్బిటర్ ఫణి కుమార్,డిప్యూటీ చీఫ్ ఆర్బిటర్ మణికంఠ, కర్నూలు జిల్లా చెస్ సంఘం అధ్యక్షులు రాకేష్ రెడ్డి, ప్రకాశం జిల్లా చెస్ సంఘం అధ్యక్షులు కొండారెడ్డి,నంద్యాల జిల్లా చెస్ సంఘం సంయుక్త కార్యదర్శి రాజా రమేష్ చక్రవర్తి, టోర్నమెంట్ నిర్వాహకురాలు సుజాత, ఎన్.ఆర్.జి చెస్ అకాడమీ వైస్ చైర్మన్ జనార్దన్ రెడ్డి, రామకృష్ణ పీజీ కళాశాల ప్రో టీమ్ సభ్యులు,క్రీడాకారులు, కోచ్ లు, క్రీడాకారుల తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Scroll to Top