
నంద్యాల / డిసెంబర్ 26- 2025 / సత్యం వార్త :
ఆర్టీసీ బస్టాండ్‌లో రూ.9 లక్షలతో నిర్మించిన ఉచిత మినరల్ వాటర్ ప్లాంట్ ప్రారంభం – జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి..
పార్లమెంట్ నిధులతో ఆర్టీసీ ప్రయాణికులు, కార్మికులకు ఉచిత శుద్ధి నీరు* – నంద్యాల ఎంపీ డా. బైరెడ్డి శబరి
నంద్యాల పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్‌లో ప్రయాణికుల దాహార్తిని తీర్చేందుకు పార్లమెంట్ నిధులతో నిర్మించిన ఉచిత మినరల్ వాటర్ ప్లాంట్‌ను జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి, నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు డా. బైరెడ్డి శబరితో కలిసి శుక్రవారం ప్రారంభించారు. రూ.9 లక్షల వ్యయంతో నిర్మించిన ఈ మినరల్ వాటర్ ప్లాంట్ ద్వారా ఆర్టీసీ ప్రయాణికులు, కార్మికులకు శుద్ధి చేసిన మంచినీరు ఉచితంగా అందుబాటులోకి వస్తుందని కలెక్టర్ తెలిపారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి మాట్లాడుతూ, నంద్యాల జిల్లా బస్ కాంప్లెక్స్‌లో ఆర్ఓ వాటర్ ప్లాంట్ ఏర్పాటుకు ఎంపీ ల్యాండ్స్ నిధుల నుంచి రూ.5 లక్షలు మంజూరు చేయడం జరిగిందన్నారు. ఈ బస్టాండ్ నుంచి ప్రతిరోజూ సుమారు 22 వేల మందికి పైగా ప్రజలు రాకపోకలు సాగిస్తున్నారని తెలిపారు. ప్రజా శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని ఎంపీ డా. బైరెడ్డి శబరి ఎప్పుడూ అభివృద్ధి ప్రతిపాదనలు సమర్పిస్తున్నారని ప్రశంసించారు. అదేవిధంగా ఆర్టీసీ బస్టాండ్ కాంప్లెక్స్‌లో పెయింటింగ్, డ్రైనేజీ మరమ్మత్తులు, టాయిలెట్ల పునరుద్ధరణ, సరైన పార్కింగ్ సదుపాయాల ఏర్పాటు వంటి పనులు చేపడుతున్నట్లు కలెక్టర్ తెలిపారు. కాంప్లెక్స్‌లోని దుకాణదారులు ఎంఆర్పీ ధరకే వస్తువులు విక్రయించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఒక నెల వ్యవధిలో బస్టాండ్ రూపురేఖలు మారేలా అభివృద్ధి పనులు జరుగుతున్నాయని, ఇందుకు ప్రజల సహకారం అవసరమని కోరారు.
ఈ సందర్భంగా నంద్యాల ఎంపీ డా. బైరెడ్డి శబరి మాట్లాడుతూ, శుద్ధి చేసిన మంచినీటితో సుమారు 60 శాతం రోగాలను నివారించవచ్చని పేర్కొన్నారు. కలుషిత నీరే అనేక వ్యాధులకు కారణమని, అందువల్ల ప్రజలకు శుద్ధి చేసిన నీరు అందించడమే లక్ష్యంగా ఎంపీ నిధులను వినియోగిస్తున్నట్లు తెలిపారు. నంద్యాల పార్లమెంట్ పరిధిలో అవసరం ఉన్న ప్రతి గ్రామంలో ఎంపీ నిధులతో మినరల్ వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేసి ఉచితంగా శుద్ధి చేసిన నీరు అందించేందుకు కృషి చేస్తున్నానని చెప్పారు. ఆర్టీసీ బస్టాండ్‌లో ప్రయాణికులు ఎక్కువ ధర చెల్లించి వాటర్ బాటిళ్లు కొనుగోలు చేయాల్సి వస్తున్న పరిస్థితిని గమనించి, ప్రయాణికులు మరియు ఆర్టీసీ కార్మికుల అభ్యర్థన మేరకు రూ.9 లక్షల ఎంపీ నిధులతో నూతన మినరల్ వాటర్ ప్లాంట్ నిర్మించి ఉచితంగా నీరు అందించడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఆర్టీసీ ఉద్యోగులు, కార్మిక సంఘాల నాయకులు, పారిశుధ్య కార్మికులు తమ సమస్యలపై ఎంపీ డా. బైరెడ్డి శబరికి వినతి పత్రాలు అందజేశారు. మున్సిపల్ కమిషనర్ శేషన్న, మార్క్‌ఫెడ్ రాష్ట్ర డైరెక్టర్ తాతిరెడ్డి తులసిరెడ్డి, ఆర్టీసీ డిపిటీసి రజియా సుల్తానా, ఆర్టీసీ డిపో మేనేజర్ జె.వి. మాధవిలత, ఆర్డబ్ల్యూఎస్ డీఆర్ఈఓ ఈ. శ్రీనివాసులు, డీఈఈ శివమోహన్, ట్రాఫిక్ సీఐ చాన్ బాషా, సెంట్రల్ ఫుడ్ కార్పొరేషన్ డైరెక్టర్ నరహరి విశ్వనాధ్ రెడ్డి, మినరల్ వాటర్ ప్లాంట్ కాంట్రాక్టర్ జగన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
