

పిజిఆర్ఎస్ కు 114 దరఖాస్తులు
జిల్లా రెవెన్యూ అధికారి డి.రామునాయక్
సత్యం వార్త / నంద్యాల జిల్లా బ్యూరో / ఫిబ్రవరి 02 :
ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా స్వీకరించిన దరఖాస్తులను క్షేత్ర స్థాయిలో పరిశీలించి సంతృప్తి స్థాయిలో వేగవంతంగా, నాణ్యతతో పరిష్కరించాలని జిల్లా రెవెన్యూ అధికారి డి.రామునాయక్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని పిజిఆర్ఎస్ హాలులో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమీషనర్ శేషన్న, జిల్లా అధికారులు పాల్గొని ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు.
ఈ సందర్భంగా జిల్లా రెవెన్యూ అధికారి డి.రామునాయక్ మాట్లాడుతూ….ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా ప్రజల నుండి స్వీకరించిన విజ్ఞప్తులను నాణ్యతతో వేగవంతంగా సంతృప్త స్థాయిలో పరిష్కరించాలని అధికారులకు సూచించారు. ప్రజల నుంచి అందిన ప్రతి ఫిర్యాదును జవాబుదారీతనంతో, నిర్ణీత గడువులోగా పరిష్కరించాలన్నారు. పిజిఆర్ఎస్ అర్జీలతో పాటు ముఖ్యమంత్రి కార్యాలయం నుండి వచ్చిన ఫిర్యాదులపై ప్రత్యేక దృష్టి సారించి ఆర్జీలు క్లియర్ చేయాలన్నారు. ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారానికి అధిక ప్రాధాన్యతనిస్తోందని పిజిఆర్ఎస్ కార్యక్రమంలో వచ్చిన అర్జీలను సంబంధిత అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి అర్జీలు బియాండ్ ఎస్ఎల్ఏ లోకి వెళ్లకుండా నిర్దిష్ట కాల పరిమితిలో పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు.
పిజిఆర్ఎస్ ద్వారా స్వీకరించిన కొన్ని సమస్యలు:
బేతంచర్ల మండలం, బేతంచర్ల గ్రామానికి చెందిన పి.లక్ష్మన్న తన రేషన్ కార్డులో తన భార్య, కుమారుని నమోదు చేసేలా చర్యలు తీసుకోవాలని డిఆర్ఓకు దరఖాస్తు సమర్పించారు.
నంద్యాల మండలం, మిట్నాల గ్రామానికి చెందిన ఎస్. నాగమహేశ్వర రెడ్డి లేఔట్ రస్తా కోసం ఇచ్చిన స్థలంలో కొందరు ఇల్లు కట్టుకున్నారని, అందుకు తగిన చర్యలు తీసుకొని రస్తా ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని డిఆర్ఓకు అర్జీ సమర్పించారు.
డోన్ మండలం, జగదుర్తి గ్రామానికి చెందిన పి. అన్నదాత సుఖీభవ నగదు జమ కాలేదని అందుకు తగిన చర్యలు తీసుకోవాలని డిఆర్ఓకు దరఖాస్తు సమర్పించారు.
ఈ కార్యక్రమంలో 114 మంది అర్జీదారులు తమ సమస్యల పరిష్కారానికి జిల్లా రెవెన్యూ అధికారికి అర్జీలు సమర్పించారు. ఈ సమస్యలన్నీ నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఎండార్స్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు.
