- రాయలసీమ విద్యా రంగంలో సరికొత్త మైలురాయి
- అంతర్జాతీయ ప్రమాణాలతో ‘శ్రీ గురురాజా ఇంటర్నేషనల్ స్కూల్’ ప్రారంభం
- ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర మంత్రి ఎన్ఎండి ఫరూక్
- 15 ఏళ్ల కల సాకారమైంది – డా. పి. దస్తగిరి రెడ్డి








సత్యం వార్త / నంద్యాల జిల్లా బ్యూరో / మార్చి 01:
నంద్యాల జిల్లా విద్యా చైతన్యానికి మారుపేరుగా నిలిచిన శ్రీ గురురాఘవేంద్ర విద్యాసంస్థల ప్రస్థానంలో మరో సువర్ణ అధ్యాయం మొదలైంది. గోస్పాడు మండలం బాబానగర్ వద్ద సుమారు 18 ఎకరాల సువిశాల ప్రాంగణంలో, అత్యాధునిక వసతులతో నిర్మించిన “శ్రీ గురురాజా ఇంటర్నేషనల్ స్కూల్” ఆదివారం ఘనంగా ప్రారంభమైంది. శ్రీ గురురాజా కాన్సెప్ట్ స్కూల్ 24వ వార్షికోత్సవ వేడుకలు ‘ప్రవాహ్’ సందర్భంగా ఈ నూతన అంతర్జాతీయ పాఠశాల ప్రాంగణాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి వర్యులు ఎన్ఎండి ఫరూక్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.
ఈ వేడుకలో గౌరవ అతిథులుగా నంద్యాల తెలుగుదేశం పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ , రామకృష్ణా విద్యాసంస్థల అధినేత డాక్టర్ జి. రామకృష్ణా రెడ్డి, డాక్టర్ రవికృష్ణ, షేక్షావలి రెడ్డి, మౌలాలి రెడ్డి తదితరులు పాల్గొన్నారు. వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య అతిథులకు విద్యార్థినులు పూర్ణకుంభంతో, పుష్పగుచ్ఛాలతో ఘనస్వాగతం పలికారు.
ఈ సందర్భంగా శ్రీ గురురాఘవేంద్ర విద్యాసంస్థల చైర్మన్ డా. పి. దస్తగిరి రెడ్డి మాట్లాడుతూ రాయలసీమ ప్రాంత విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయి విద్యను అందించాలనే తన 15 ఏళ్ల కల నేడు సాకారమైందని తెలిపారు. అమెరికా, దుబాయ్, సింగపూర్ వంటి దేశాల్లోని విద్యా విధానాలను అధ్యయనం చేసి, అక్కడి ప్రమాణాలను మన గ్రామీణ ప్రాంత విద్యార్థులకు అందుబాటులోకి తెచ్చామని పేర్కొన్నారు. తన కుమారులు షేక్షావలి రెడ్డి, మౌలాలి రెడ్డిల పర్యవేక్షణలో ఈ ప్రాంగణం రూపుదిద్దుకుందని, ప్రస్తుతం 0 నుండి 8వ తరగతి వరకు ప్రవేశాలు కల్పిస్తున్నామని, భవిష్యత్తులో ఇంటర్ వరకు విస్తరిస్తామని వెల్లడించారు. ఎన్జీఓ కాలనీలోని శ్రీ గురురాఘవేంద్ర బ్యాంకింగ్ కోచింగ్ సెంటర్ మరియు గురు రాఘవేంద్ర ఇంగ్లీష్ మీడియం స్కూల్ యధావిధిగా కొనసాగుతాయని ఆయన స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా మంత్రి ఎన్ఎండి ఫరూక్ మాట్లాడుతూ నంద్యాల ప్రాంత విద్యా చరిత్రలో ఇదొక చారిత్రాత్మక ఘట్టమని కొనియాడారు. నంద్యాల ఖ్యాతి “ఒకప్పుడు కేవలం వ్యాపారానికి పరిమితమైన నంద్యాల, నేడు డాక్టర్ పి. దస్తగిరి రెడ్డి కృషితో దేశవ్యాప్తంగా బ్యాంకింగ్ రంగంలోనూ, విద్యా రంగంలోనూ ఒక బ్రాండ్‌గా మారిపోయిందని . ఇక్కడ చదివిన విద్యార్థులు దాదాపు 43 వేల ఉద్యోగాలు సాధించి దేశంలోని అన్ని బ్యాంకుల్లో ఉద్యోగాలు సాధించడం గర్వకారణం అన్నారు. “రాయలసీమ విద్యార్థులు క్వాలిటీ ఎడ్యుకేషన్ కోసం బెంగళూరు, హైదరాబాద్ వంటి నగరాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా, బాబానగర్ వంటి గ్రామీణ ప్రాంతంలో 18 ఎకరాల్లో అంతర్జాతీయ స్థాయి వసతులతో పాఠశాలను ఏర్పాటు చేయడం అభినందనీయని అన్నారు . కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా ఇక్కడ క్రీడా సౌకర్యాలు, ఆధునిక బోధన అందించడం గొప్ప విషయం అన్నారు. “విద్యాబోధనతో పాటు క్రమశిక్షణ, సాంస్కృతిక విలువలపై దస్తగిరి రెడ్డి చూపే శ్రద్ధ విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తుందని . ఇలాంటి విద్యాసంస్థలు మరిన్ని రావాలని, ప్రభుత్వ పరంగా కూడా విద్యా రంగానికి అన్ని విధాలా సహకారం ఉంటుందని” మంత్రి ఫరూక్ తెలిపారు. అనంతరం షేక్షావలి రెడ్డి, మౌలాలి రెడ్డి లను ప్రత్యేకంగా అభినందించారు.
వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అతిధులను, ప్రజలను ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా ‘శివ.. శివ.. శంకర..’ అనే నృత్య రూపకం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. విద్యార్థుల ప్రతిభను, క్రమశిక్షణను చూసి తల్లిదండ్రులు, అతిథులు హర్షం వ్యక్తం చేశారు. అనంతరం ముఖ్య అతిథులను నిర్వాహకులు ఘనంగా సన్మానించారు .
ఈ కార్యక్రమంలో పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులు మరియు పెద్ద సంఖ్యలో తల్లిదండ్రులు పాల్గొన్నారు.
