
సత్యం వార్త / నంద్యాల జిల్లా ప్రతినిధి / ఫిబ్రవరి 23:
రాష్ట్రంలో గత ప్రభుత్వ కాలంలో హిందూ సంస్కృతి మూలాలను ధ్వంసం చేసే కుట్ర జరిగిందని ఆరోపిస్తూ, 2019 నుంచి 2024 వరకు జరిగిన ఘటనలపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలని కోరుతూ నంద్యాల జిల్లా బీజేపీ నాయకులు సోమవారం జిల్లా కలెక్టర్ కు వినతిపత్రం సమర్పించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో భాగంగా నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా బీజేపీ అధ్యక్షులు అభిరుచి మదు ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో హాజరై తమ డిమాండ్లను వినిపించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, జనతా వారధి కార్యక్రమంలో భాగంగా ప్రజలతో నిర్వహిస్తున్న పర్యటనలలో హిందూ సమాజానికి జరిగిన అన్యాయాలపై విస్తృత స్థాయిలో ఆందోళన వ్యక్తమవుతోందన్నారు. శ్రీవారి లడ్డు ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగం జరిగిందన్న ఆరోపణలు, శాసనమండలిలో కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి చిత్రపటానికి అవమానం జరిగిందన్న అంశాలు ప్రజల్లో తీవ్ర మనోవేదన కలిగించాయని పేర్కొన్నారు.
వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో హిందూ ఆలయాలు, దేవతా విగ్రహాలు, రథాల ధ్వంసం జరిగిన ఘటనలు రాష్ట్రవ్యాప్తంగా నమోదయ్యాయని, ఈ సంఘటనలపై సమగ్ర విచారణ చేపట్టి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. హిందూ విశ్వాసాలను దెబ్బతీసే చర్యలు పునరావృతం కాకుండా ప్రభుత్వం స్పష్టమైన చర్యలు తీసుకోవాలన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల ద్వారా ప్రజల విజ్ఞాపనలను రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. హిందూ సంస్కృతి పరిరక్షణ కోసం నిరంతర పోరాటం కొనసాగిస్తామని జిల్లా బీజేపీ అధ్యక్షులు అభిరుచి మదు స్పష్టం చేశారు. కార్యక్రమంలో పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు
