

స్వచ్ఛ ఆంధ్ర ప్రతిజ్ఞ నిర్వహించిన జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి
సత్యం వార్త / నంద్యాల జిల్లా బ్యూరో / జనవరి 24 :
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న “స్వర్ణాంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర” కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో ప్రతి ప్రభుత్వ ఉద్యోగి, ప్రతి పౌరుడు బాధ్యతాయుతంగా భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి పిలుపునిచ్చారు. శుక్రవారం నంద్యాల కలెక్టరేట్ ఆవరణలో నిర్వహించిన స్వర్ణాంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పాల్గొని స్వచ్ఛ ఆంధ్ర ప్రతిజ్ఞ చేయించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, పరిశుభ్రమైన పరిసరాలు ఆరోగ్యకరమైన సమాజానికి పునాదిగా నిలుస్తాయని, స్వచ్ఛత అనేది ఒక్కరోజు కార్యక్రమం కాదని, నిత్య జీవన విధానంగా మారాలని పేర్కొన్నారు. ప్రభుత్వ కార్యాలయాల నుంచి గ్రామ స్థాయి వరకు పారిశుద్ధ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని, చెత్త వేరు చేయడం, ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడం, పరిసరాలను శుభ్రంగా ఉంచడం ద్వారా స్వచ్ఛ ఆంధ్ర లక్ష్యాన్ని సాధించవచ్చని కలెక్టర్ తెలిపారు. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులు ప్రజలకు ఆదర్శంగా నిలవాలని ఆమె సూచించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ కొల్లా బత్తుల కార్తీక్, డిఆర్ఓ రాము నాయక్, కలెక్టరేట్ సిబ్బంది, అధికారులు, ఉద్యోగులు పాల్గొని స్వచ్ఛ ఆంధ్ర ప్రతిజ్ఞ చేశారు.
