లారీ, బస్ డ్రైవర్లకు ఉచిత ఆరోగ్య–కంటి పరీక్షలు

రోడ్డు భద్రతకు ‘మేకింగ్ ది డిఫరెన్స్’తో కలిసి రాయలసీమ ఎక్స్‌ప్రెస్ వే కార్యక్రమం

సత్యం వార్త / నంద్యాల క్రైమ్ / ఫిబ్రవరి 09 :

రాయలసీమ ఎక్స్‌ప్రెస్ వే ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో రోడ్డు భద్రత కార్యక్రమంలో భాగంగా “మేకింగ్ ది డిఫరెన్స్” ఎన్జీఓ సహకారంతో నంద్యాల లారీ ఓనర్స్ అసోసియేషన్ ప్రాంగణంలో లారీ డ్రైవర్లు, బస్ డ్రైవర్లు, క్లీనర్లకు రెండు రోజుల పాటు ఉచిత ఆరోగ్య మరియు కంటి పరీక్షల శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో అవసరమైన వారికి ఉచితంగా కంటి అద్దాలు పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నంద్యాల జిల్లా అదనపు ఎస్పీ జావళి, రాయలసీమ ఎక్స్‌ప్రెస్ వే ప్రాజెక్టు హెడ్ మదన్మోహన్ వంగర, నంద్యాల ఏపీఎస్ఆర్టీసీ డిపో మేనేజర్ మాధవీలత, ట్రాఫిక్ సీఐ చాంద్ బాషా, లారీ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. శిబిరంలో సుమారు 200 మంది డ్రైవర్లకు సాధారణ ఆరోగ్య పరీక్షలు, కంటి పరీక్షలు నిర్వహించగా, అవసరమైన వారికి ఉచిత కంటి అద్దాలు అందజేశారు.

ఈ సందర్భంగా అదనపు ఎస్పీ జావళి మాట్లాడుతూ డ్రైవర్ల ఆరోగ్యం రోడ్డు భద్రతకు కీలకమని పేర్కొన్నారు. ఇలాంటి వైద్య శిబిరాలను డ్రైవర్లు సద్వినియోగం చేసుకోవాలని, మద్యం సేవించి వాహనాలు నడపకూడదని, ట్రాఫిక్ నిబంధనలను కచ్చితంగా పాటించాలని సూచించారు.

రాయలసీమ ఎక్స్‌ప్రెస్ వే ప్రాజెక్టు హెడ్ మదన్మోహన్ వంగర మాట్లాడుతూ డ్రైవర్ల కోసం ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందని తెలిపారు. కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రతి డ్రైవర్ వినియోగించుకోవాలని కోరారు. అలాగే ఏవైనా ప్రమాదాలు జరిగినప్పుడు 1033 హెల్ప్‌లైన్ నంబర్‌ను వినియోగించుకోవాలని సూచిస్తూ, రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని స్పష్టం చేశారు.

కర్నూల్ నుంచి కడప వరకు ఉన్న హైవే మార్గంలో రెండు రెస్ట్ ఏరియాలు, నాలుగు ట్రక్ లే-బైలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. డ్రైవర్లు అలసటగా అనిపించినప్పుడు అక్కడ వాహనాలను నిలిపి విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. రెస్ట్ ఏరియాలు, ట్రక్ లే-బై లొకేషన్లకు సంబంధించిన క్యూఆర్ కోడ్ కరపత్రాలను ముద్రించి పంపిణీ చేస్తున్నట్లు వెల్లడించారు.

Scroll to Top