రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా

సత్యం వార్త / నంద్యాల జిల్లా బ్యూరో / మార్చి 07 :

ఈ నెల 9వ తేదీన డోన్ మండలం కొత్త బురుజు గ్రామంలో రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటన జరగనున్న నేపథ్యంలో నిర్వహించనున్న కార్యక్రమాల ఏర్పాట్లను సమగ్రంగా, ఎలాంటి లోపాలు లేకుండా పకడ్బందీగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం కొత్త బురుజు గ్రామంలో ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ స్వయంగా క్షేత్రస్థాయిలో పరిశీలించారు. కార్యక్రమం నిర్వహించనున్న ప్రదేశాలు, హెలిప్యాడ్ మైదానం, సభాస్థలి తదితర ప్రాంతాలను ఎమ్మెల్యే కోట్ల జయ సూర్య ప్రకాష్ రెడ్డి, జిల్లా పోలీసు సూపరింటెండెంట్ సునీల్ షొరాణ్, జాయింట్ కలెక్టర్ కొల్లాబత్తుల కార్తీక్ లతో సందర్శించి అధికారులకు పలు సూచనలు చేశారు.

ఈ సందర్భంగా హెలిప్యాడ్ ఏర్పాట్లు, భద్రతా చర్యలు, వాహనాల పార్కింగ్, తాగునీటి సదుపాయం, వైద్య సేవలు, విద్యుత్ సరఫరా, పారిశుధ్య నిర్వహణ వంటి అంశాలను ప్రత్యేకంగా పరిశీలించారు. ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి ఏర్పాట్లను సమయానికి పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.  ముఖ్యమంత్రి పర్యటనకు ముందు నిర్వహించనున్న అడ్వాన్స్ సెక్యూరిటీ లియాజన్ సర్వేకు అవసరమైన అన్ని ఏర్పాట్లపై ట్రయల్ రన్ నిర్వహించగా, వాటిని కూడా జిల్లా కలెక్టర్ పరిశీలించారు. భద్రతా చర్యలను కట్టుదిట్టంగా అమలు చేయాలని పోలీసు శాఖ అధికారులకు సూచించారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి సందర్శించనున్న రైతు పొలాన్ని జిల్లా కలెక్టర్ పరిశీలించారు. అక్కడ ఉన్న రైతులతో మాట్లాడి సాగు పరిస్థితులు, పంటల స్థితిగతులపై వివరాలు తెలుసుకున్నారు. ముఖ్యమంత్రి రైతులతో ముఖాముఖి అయ్యే కార్యక్రమం సజావుగా జరిగేలా అవసరమైన ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. తదుపరి సభాస్థలిని సందర్శించిన జిల్లా కలెక్టర్ వేదిక ఏర్పాటు, ప్రజల కూర్చునే ఏర్పాట్లు, తాగునీటి సదుపాయం, నీడ ఏర్పాట్లు, వాహనాల పార్కింగ్, భద్రతా చర్యలు వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులకు సూచించారు. ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు ముందుగానే పూర్తి చేయాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డోన్ ఆర్డిఓ నరసింహులు వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Scroll to Top