మార్కెట్ కమిటీల చైర్మన్ లకు చెక్ పవర్ పునరుద్ధరించాలి – మంత్రి లోకేష్ కు విన్నవించిన చైర్మన్లు

సత్యం వార్త / మార్చి 17 :

రాష్ట్రంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీల చైర్మన్ లకు చెక్ పవర్ ను పునరుద్ధరించాలని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ కు  వ్యవసాయ కమిటీల చైర్మన్లు  విన్నవించారు. మంగళవారం ఉండవల్లి క్యాంపు కార్యాలయంలో మంత్రి లోకేష్ ను  రాష్ట్ర వ్యవసాయ మార్కెట్ కమిటీల చైర్మన్ ల సంఘం అధ్యక్షుడు గుంటుపల్లి హరిబాబు ఆధ్వర్యంలో సంఘం ప్రతినిధులు కలిశారు.ఈ సందర్భంగా రాష్ట్రంలో వ్యవసాయ మార్కెట్ కమిటీలకు సంబంధించిన పలు సమస్యలను మంత్రి నారా లోకేష్ కు వివరించారు. కమిటీల బలోపేతానికి, క్షేత్రస్థాయిలో మరిన్ని సేవలలో భాగస్వామ్యం కల్పించాలని కోరుతూ, ప్రభుత్వ నియమ బంధనలలో మార్పులు చేయాల్సిన పరిస్థితులను సంఘం అధ్యక్షుడు గుంటుపల్లి హరిబాబు మంత్రికి వివరించారు. కమిటీల ఆధ్వర్యంలో  వ్యవసాయ ఉత్పత్తుల పై పన్నుల వసూలు, గౌరవ వేతనాలు, డొంకరోడ్ల, నిర్మాణాలకు నిధులు మంజూరు,మార్కెట్ కమిటీ నిధుల నుండి సీఎంఎఫ్ 25 శాతం,20 శాతం పెన్షన్ కాంట్రిబ్యూషన్ పై నియంత్రణ  తదితర అంశాలను  మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. ముఖ్యంగా రైతు శ్రేయస్సు లక్ష్యం గా మార్కెట్ కమిటీ లు అభివృద్ధి చేసేలా మార్కెట్ కమిటీల చైర్మన్ ల కు చెక్ పవర్ పునరుద్ధరణ చేయాలని కోరారు. వ్యవసాయ మార్కెట్ కమిటీ ల పరిధిలో లింకు (పుంత) రోడ్ల నిర్మాణం కొరకు నిధులు మంజూరు చేయాలని కోరారు.మార్కెట్ కమిటీ చైర్మల కాల పరిమితి 3 సంవత్సరాలు ఉండేలా నిబంధనలు సవరించాలని మంత్రి లోకేష్ కు వివరించారు. మార్కెట్ కమిటీ చైర్మన్ లకు హోదాలో అలవెన్సులు తేడా లేకుండా ఒకేలా ఉండేలా తెలంగాణా ప్రభుత్వం జి.ఓ యం.యస్. నెం. 28, Dt. 26-02-2018 తరహాలోనే ఏపీలో కూడా  అమలు జరిగేలా చూడాలని అన్నారు.రైతు బజార్ల పర్యవేక్షణ మార్కెట్ యార్డు చైర్మన్ ల కు ఉండేలా చేయాలన్నారు.మార్కెట్ కమిటీ చైర్మన్ లకు జిల్లా స్థాయితోపాటు, నియోజకవర్గ పరిధిలో జరిగే ప్రభుత్వ కార్యక్రమాలలో ప్రోటోకాల్ వర్తించేలా  చేయాలని మంత్రి నారా లోకేష్ దృష్టికి మార్కెట్ కమిటీల చైర్మన్ ల సంఘం ప్రతినిధులు  తీసుకువెళ్లారు.ఈ విషయం పై  మంత్రి నారా లోకేష్ సానుకూలంగా స్పందించారని, త్వరలోనే సమస్యలన్నీ పరిష్కారం అవుతాయని ఆశిస్తున్నట్లు  మార్కెట్ కమిటీల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గుంటుపల్లి హరిబాబు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ల సంఘం ప్రధాన కార్యదర్శి  కొండ ప్రవీణ్, ఉపాధ్యక్షులు అమర్నాథ్ యాదవ్, ఏరువా శ్రీనివాసులు, బర్రా వాసు, కదిలండీ రామచంద్ర రాజు, కిరణ్ చంద్ తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top