బడ్జెట్‌లో ఉద్యోగుల బకాయిలకు స్పష్టత ఇవ్వాలి

మంత్రి ఫరూక్‌ను కలిసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం

సత్యం వార్త / నంద్యాల జిల్లా ప్రతినిధి / ఫిబ్రవరి 02 :

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న వేల కోట్ల రూపాయల బకాయిలు, వేతన సవరణ, నాలుగు విడతల డి.ఏలు, సరెండర్ లీవులు తదితర ఆర్థిక ప్రయోజనాలపై 2026–27 రాష్ట్ర బడ్జెట్‌లో స్పష్టమైన కేటాయింపులు చూపాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం డిమాండ్ చేసింది. బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో మంత్రి యన్.యం.డి. ఫరూక్‌ను సంఘ ప్రతినిధులు సోమవారం కలిశారు. ఇప్పటికే మంజూరైన బకాయిల చెల్లింపులపై ప్రభుత్వం స్పష్టమైన విధాన ప్రకటన చేయాలని, లేదా ప్రత్యామ్నాయ పరిష్కార మార్గాన్ని బడ్జెట్ ద్వారా వెల్లడించాలని కోరారు. అలాగే సిట్టింగ్ లేదా విశ్రాంత న్యాయమూర్తి నేతృత్వంలో పీఆర్‌సీ కమిషన్ ఏర్పాటు, మధ్యంతర భృతి మంజూరు, సీపీఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానం (ఓపీఎస్) పునరుద్ధరణ అంశాలపై ఎన్నికల హామీలను అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ అంశాలను ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లి, అవసరమైతే శాసనసభలో ప్రస్తావిస్తామని మంత్రి ఫరూక్ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర, జిల్లా, మహిళా విభాగం, పెన్షనర్ల విభాగం ప్రతినిధులు పాల్గొన్నారు.

Scroll to Top