ముద్రణ విప్లవ కర్తకు ఘన నివాళి
ర్యాలీ, ప్రభుత్వాసుపత్రిలో అన్నదానం*


సత్యం వార్త / నంద్యాల / ఫిబ్రవరి 24: ముద్రణాయంత్ర సృష్టికర్త జోహాన్స్ గూటెన్బర్గ్ జయంతిని పురస్కరించుకుని నంద్యాల ప్రింటర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంగళవారం పలు కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ముద్రణ రంగ అభివృద్ధికి ఆయన చేసిన అపార సేవలను సభ్యులు కృతజ్ఞతాభావంతో స్మరించుకున్నారు. ఈ సందర్భంగా పట్టణంలోని శ్రీ కాళికాంభ దేవాలయంలో కార్యవర్గ సమావేశం నిర్వహించారు. సమావేశంలో ముద్రణ రంగం ప్రస్తుత పరిస్థితులు, అభివృద్ధి అవకాశాలపై చర్చించారు. అనంతరం పట్టణ వీధుల్లో ర్యాలీ నిర్వహించి గూటెన్బర్గ్ సేవలను ప్రజలకు వివరించారు. తదుపరి ప్రభుత్వాసుపత్రిలో మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం నిర్వహించి రోగులు, వారి బంధువులకు భోజనాన్ని పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు యం. వెంకటేశ్వర్లు, అధ్యక్షులు యం.పి. రవిశేఖర్, ప్రధాన కార్యదర్శి పి. మద్దిలేటి, ఖజాంచి డి.సి. జమాల్ బాషా, ఉపాధ్యక్షులు జి. వెంకట రమణ, ఆర్గనైజింగ్ కార్యదర్శి వై. ఓబులేసు తదితర కమిటీ సభ్యులు పాల్గొన్నారు. కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించినందుకు అసోసియేషన్ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు.
