
సత్యం వార్త / నంద్యాల జిల్లా బ్యూరో / మార్చి 23 :
నంద్యాల మార్చి 24 న జరగనున్న ‘ప్రపంచ క్షయ నివారణ దినోత్సవం’ పురస్కరించుకుని, నంద్యాలలోని మంత్రి కార్యాలయంలో సోమవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ సంబంధిత అవగాహన పోస్టర్లను విడుదల చేశారు.
ఈ సందర్భంగా మంత్రి ఎన్ఎండి ఫరూక్ మాట్లాడుతూ క్షయ రహిత సమాజం దిశగా ప్రభుత్వం చేస్తున్న కృషిలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో క్షయ వ్యాధి నిర్ధారణకు సంబంధించి గళ్ల పరీక్ష, ఎక్స్-రే, సీబీనాత్ మరియు ఆర్టీపీసీర్ వంటి ఆధునిక పరీక్షలు ఉచితంగా అందుబాటులో ఉన్నాయని మంత్రి ఫరూక్ తెలిపారు. క్షయ వ్యాధిగ్రస్తులకు చికిత్స సమయంలో పౌష్టికాహారం కోసం నెలకు రూ. 1000/- చొప్పున ప్రభుత్వం నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లోకి జమ చేస్తోందని . సాధారణ టీబీ మరియు మొండి టీబీ బాధితులకు అవసరమైన ఖరీదైన మందులను ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేస్తోందని . 2 వారాల కంటే ఎక్కువ కాలం దగ్గు, జ్వరం, బరువు తగ్గడం వంటి లక్షణాలు ఉంటే వెంటనే పరీక్షలు చేయించుకోవాలని, క్రమం తప్పకుండా మందులు వాడితే టీబీని పూర్తిగా నయం చేయవచ్చని మంత్రి ఫరూక్ సూచించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా క్షయ నివారణ అధికారి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు నంద్యాల మార్కెట్ యార్డ్ చైర్మన్ గుంటుపల్లి హరిబాబు మరియు ఇతర సంబంధిత ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు.
